ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్, , బోరజ్ మండలాల్లో స్వయం సహాయక సంఘాల గ్రేడింగ్ పై మండల సమాఖ్య కార్యనిర్వాహక సభ్యులకు శిక్షణ కార్యక్రమం జరిగింది. క్లస్టర్ లెవెల్ ఫెడరేషన్ సీఆర్పీలు ఈ శిక్షణను అందించారు. పంచ సూత్రాలు పాటించడం ద్వారా సంఘాలు ఏ, బీ గ్రేడ్ లోకి వస్తాయని తెలిపారు.
బోరాజ్, మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయంలో మంగళవారం, క్లస్టర్ లెవెల్ ఫెడరేషన్ సీఆర్పీల ఆధ్వర్యంలో ఉట్నూర్, , బోరజ్ మండల సమాఖ్య కార్యనిర్వాహక సభ్యులకు స్వయం సహాయక సంఘాలు, గ్రామ సంఘాలు, మండల సమాఖ్యల గ్రేడింగ్ పై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా శిక్షణ ఇచ్చిన ఎండి షహదా బేగం, రాజవర్ణ, ఏ పద్మ, పి నాగలక్ష్మి మాట్లాడుతూ, ప్రతి స్వయం సహాయక సంఘం పంచ సూత్రాలు పాటించాలని సూచించారు. ఈ సూత్రాలు సంఘాలకు గుండె లాంటివని, వీటిని పాటించడం ద్వారా సంఘాలు, గ్రామ సంఘాలు, క్లస్టర్ లెవెల్ ఫెడరేషన్లు ఏ గ్రేడ్ లోకి వస్తాయని వివరించారు. గ్రేడింగ్ లో ఐదు రకాలు ఉంటాయని, 100 నుంచి 90 మార్కులు వస్తే ఏ గ్రేడ్, 80 నుంచి 70 వస్తే బి గ్రేడ్, 60 నుంచి 50 వస్తే సీ గ్రేడ్, 50 నుంచి 40 వస్తే డి గ్రేడ్ వస్తుందని తెలిపారు. ప్రతి నెల క్రమం తప్పకుండా సంఘాల సమావేశాలు నిర్వహించడం, పొదుపు చేయడం, అంతర్గత అప్పులు వసూలు చేయడం, తిరిగి అప్పులు ఇవ్వడం, పుస్తక నిర్వహణ వంటి ఐదు పంచ సూత్రాలు పాటించే సంఘాలు ఎప్పటికీ ఏ, బి గ్రేడ్ లో ఉంటాయని అన్నారు.
గ్రామ సంఘాల కార్యనిర్వాహక సభ్యులకు సంఘాలు, గ్రామ సంఘాలు, మండల సమాఖ్యల లావాదేవీలపై పూర్తిస్థాయిలో అవగాహన ఉండాలని సూచించారు. ఏ, బి గ్రేడ్ లో ఉన్న సంఘాలకు అధిక రుణాలు పొందే అర్హత ఉంటుందని తెలిపారు. బ్యాంకు లింకేజ్ రుణాలు, స్త్రీనిధి రుణాలు, అంతర్గత అప్పులు, ఇతర రుణాలు తీసుకున్న సంఘ సభ్యులు వాటిని సక్రమంగా తిరిగి చెల్లిస్తే, అటువంటి సంఘాలకు వడ్డీ లేని రుణాలు పొందే అవకాశం ఉంటుందని అన్నారు. క్రమం తప్పకుండా, క్రమశిక్షణతో ప్రతి నెల సంఘ సమావేశాలు నిర్వహించే సంఘాలు ఎప్పటికీ లాభదాయకంగా ఉంటాయని పేర్కొన్నారు. తీసుకున్న రుణాలతో చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుని, మహిళలు వ్యాపార రంగంలో ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఉట్నూరు ఏపీఎం రాథోడ్ రామారావు, ఎస్ఈఈపీఏ పీఎం మాధవ్, సీసీలు సంతోష్, పద్మారావు, రాథోడ్ సంతోష్, అకౌంటెంట్ జ్యోతిరామ్, మండల సమాఖ్య కార్యనిర్వాహక సభ్యులు, ఉమ్మడి , బోరజ్ మండలాల ఏపీఎం గంపవారు సుజాత, సీసీలు శ్రీనివాస రెడ్డి, హేమలత, నాగమణి, వెంకటరెడ్డి, గంగారాం, అకౌంటెంట్ లక్ష్మి, గ్రామ సంఘాల వీవోఏలు, మండల సమాఖ్య కార్యనిర్వాహక సభ్యులు తదితరులు పాల్గొన్నారు.












