మండల కేంద్రంలోని పాత తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని గ్రంథాలయంగా, చదువుకునే కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రజాప్రతినిధులు, సామాజిక సేవకులు కోరుతున్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ప్రశాంతమైన వాతావరణం కల్పించేందుకు ఈ భవనాన్ని వినియోగంలోకి తీసుకురావాలని వారు గ్రామసభల్లో ప్రస్తావించారు.
ఈ క్రమంలో చిట్యాల సర్పంచి చీమల భీమేష్, మండల సామాజిక సేవకులు సీహెచ్. రాజేశ్‌కుమార్ ఛత్రపతి బుధవారం పాత తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. భవనాన్ని పరిశీలించి, అవసరమైన మరమ్మతులపై చర్చించారు.
భవనానికి శుభ్రత పనులు చేపట్టడం, విద్యుత్ సౌకర్యాలు కల్పించడం, రంగులు వేయడం ద్వారా విద్యార్థులకు ఉపయోగకరమైన గ్రంథాలయంగా మార్చవచ్చని వారు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు చదువుకునే అవకాశం కల్పిస్తే, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.
ప్రభుత్వ భవనం ఖాళీగా ఉండకుండా, విద్యార్థుల పుస్తకాలతో నిండేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ ప్రయత్నాన్ని త్వరగా కార్యరూపంలోకి తీసుకువచ్చి, మండల విద్యార్థుల కోసం పాత తహసీల్దార్ కార్యాలయాన్ని గ్రంథాలయంగా అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు.












