మండలంలోని ఎల్వత్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు అదనపు తరగతి గదులు మంజూరు చేయాలని కోరుతూ రాజ్‌కుమార్ సూర్యాజీ జాదవ్, దిగంబర్ చందర్ పాటిల్ జిల్లా విద్యాధికారికి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం పాఠశాలలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు 67 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.
అయితే, వారందరికీ ఒకే తరగతి గది అందుబాటులో ఉండటంతో బోధనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఒకే గదిలో ఐదు తరగతుల విద్యార్థులకు బోధించాల్సి వస్తుండటంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. పాఠశాలలో మౌలిక వసతుల కొరత విద్యార్థుల చదువుపై ప్రభావం చూపుతోందని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రెండు అదనపు తరగతి గదులను తక్షణమే మంజూరు చేసి నిర్మాణ పనులు చేపట్టాలని జిల్లా విద్యాధికారిని కోరారు. పాఠశాలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించి, విద్యార్థులకు మెరుగైన విద్య అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.












