మండలం మోతె గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దివంగత అల్లపుల్ల రాజయ్య స్మారకార్థం సుమారు రూ. 11 లక్షల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన అధునాతన గ్రంథాలయాన్ని బాల్కొండ శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఘనంగా ప్రారంభించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెజ్జ గణేష్ అధ్యక్షతన జరిగిన ఈ ప్రారంభోత్సవ సభలో ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయ సంఘాల నేతలు, గ్రామస్తులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మండలం మోతె గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దివంగత అల్లపుల్ల రాజయ్య స్మారకార్థం సుమారు రూ. 11 లక్షల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన అధునాతన గ్రంథాలయాన్ని బాల్కొండ శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఘనంగా ప్రారంభించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెజ్జ గణేష్ అధ్యక్షతన జరిగిన ఈ ప్రారంభోత్సవ సభలో ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయ సంఘాల నేతలు, గ్రామస్తులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శాసనసభ్యులు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, నేటి స్వార్థపూరిత సమాజంలో అధిక శాతం మంది నేను, నా కుటుంబం, నా సంపద అనే ఆలోచనలకే పరిమితమవుతున్న ప్రస్తుత తరుణంలో, సమాజ శ్రేయస్సును కాంక్షిస్తూ నిస్వార్థంగా ముందుకు వచ్చే వ్యక్తులు చాలా అరుదని పేర్కొన్నారు. అటువంటి అరుదైన వ్యక్తుల్లో మోతెకు చెందిన తన మిత్రుడు గంగారెడ్డి ఒక ఆణిముత్యం లాంటి వారని కొనియాడారు. గంగారెడ్డి ఏమీ అపర కుబేరుడు కాకపోయినప్పటికీ, తాను కష్టపడి సంపాదించిన పరిమిత రాబడి నుంచే సమాజ హితం కోసం నిధులు వెచ్చిస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఆయన చేపడుతున్న సేవా కార్యక్రమాలకు సతీమణి వసంత, కుమారుడు శ్రేయాంశ్ సంపూర్ణ మద్దతు ఇవ్వడం ఎంతో ఆదర్శనీయమని, కుటుంబ సహకారం లేకపోతే ఇటువంటి ఉన్నతమైన ఆశయాలు సాకారం కావని స్పష్టం చేస్తూ వారిని ప్రత్యేకంగా అభినందించారు.
గంగారెడ్డితో తనకు గత 12-13 సంవత్సరాలుగా అత్యంత సన్నిహిత అనుబంధం ఉందని ఎమ్మెల్యే గుర్తుచేశారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో లండన్ నుంచి వచ్చిన తొలినాళ్లలోనే, ఎలాంటి వ్యక్తిగత లాభాపేక్ష ఆశించకుండా కేవలం స్వరాష్ట్ర సాధన పట్ల ఉన్న బలమైన నిబద్ధతతో లక్షలాది రూపాయల స్వంత నిధులను వెచ్చించి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారని కొనియాడారు. కరోనా మహమ్మారి సంక్షోభ సమయంలోనూ, అంతకుముందు అనేక సామాజిక అంశాల్లోనూ గంగారెడ్డి నిస్వార్థంగా ప్రజలకు సేవలందించారని గుర్తుచేశారు.
గ్రంథాలయం ఏర్పాటులో గంగారెడ్డి కృషి
గ్రంథాలయం కోసం వెచ్చించిన రూ. 11 లక్షల విరాళం కంటే, ఆ గ్రంథాలయం విద్యార్థులకు నిరంతరం ఏ విధంగా ఉపయుక్తంగా ఉండాలనే దానిపై గంగారెడ్డి చేసిన కసరత్తు, వెచ్చించిన వందలాది గంటల సమయం రూ. 11 కోట్లతో సమానమని ఎమ్మెల్యే కొనియాడారు. భీమ్గల్లో సీనియర్ విద్యావేత్త డాక్టర్ వసంత్ రెడ్డి గారు గ్రంథాలయం ఏర్పాటు చేసిన తర్వాత ఎదురైన నిర్వహణ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, మోతెలో విద్యార్థులకు గ్రంథాలయం నిరంతరం చేరవయ్యేలా ఒక సమగ్రమైన కార్యాచరణను రూపొందించారని ప్రశంసించారు. ఉపాధ్యాయుల భాగస్వామ్యంతో పుస్తక పఠనాన్ని విద్యార్థులకు అలవాటుగా మార్చడం, చదివిన విషయాలను సమీక్షించుకుని వీడియోల రూపంలో సోషల్ మీడియా/యూట్యూబ్లో ప్రదర్శిస్తూ వారిలో ఆత్మవిశ్వాసాన్ని, ఆరోగ్యకరమైన పోటీతత్వాన్ని పెంపొందించే ప్రణాళికను ప్రశంసించారు.











