భైంసాలో గణేశ్ నిమజ్జనోత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావ్ పటేల్ సూచించారు. జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల మాట్లాడుతూ, గత మూడు సంవత్సరాలుగా భైంసాలో గణేశ్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించడం అభినందనీయమని తెలిపారు.
మంగళవారం భైంసాలో గణేశ్ నిమజ్జనోత్సవాల సందర్భంగా మున్నూరు కాపు సంఘ భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పవార్ రామారావ్ పటేల్ మాట్లాడారు. మున్నూరు కాపు సంఘం, గణేశ్‌నగర్, గోపాలకృష్ణ మందిర్‌లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా భక్తులు, నిర్వాహకులు పరస్పరం సహకరించుకుంటూ నిమజ్జనోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని ఎమ్మెల్యే కోరారు. ప్రజలు, ఉత్సవ కమిటీలు పోలీసులకు సహకరిస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు తోడ్పడాలని ఎస్పీ జానకి షర్మిల విజ్ఞప్తి చేశారు.
మున్నూరు కాపు సంఘ భవనంలో ఏర్పాటు చేసిన గణేశ్ లడ్డూను రూ.20,100కు భక్తులు దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమ్మొల్ల దత్తాత్రి, మాజీ మున్సిపల్ చైర్మన్ గంగాధర్, కౌన్సిలర్లు, నాయకులు, సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.











