వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయం, వేములవాడ (మనోరంజని తెలుగు టైమ్స్) నవంబర్ 08
ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో నరకచతుర్దశి, దీపావళి పర్వదిన వేడుకలు ఆదివారం వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున స్వామివారికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించగా, సాయంత్రం ధనలక్ష్మి మహాపూజ, పెద్దసేవ ఊరేగింపు భక్తులను ఆకట్టుకున్నాయి.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో నరకచతుర్దశి, దీపావళి పర్వదిన వేడుకలు ఆదివారం వైభవంగా నిర్వహించారు. పర్వదినాన్ని పురస్కరించుకుని తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవ, మంగళహారతి, అభ్యంగన స్నానాలు, ప్రాతఃకాల పూజలను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం శ్రీ భీమేశ్వరాలయంలో నరకాసుర వధ పురాణ ప్రవచనం నిర్వహించారు. అనంతరం రాజన్న ఆలయంలోని శ్రీ రాజరాజేశ్వరీ అమ్మవారి సన్నిధిలో ధనలక్ష్మి మహాపూజను ఏకాంతంగా ఘనంగా నిర్వహించారు. ఈ పూజల్లో ఆలయ ఈవో ఎల్. రమాదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవస్థానం క్యాషియర్ నరేష్‌కు స్వామివారి శేషవస్త్రం, లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వచనం అందించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన పెద్దసేవ ఊరేగింపు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని హరిహరమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఈవో ఎల్. రమాదేవితో కలిసి స్వయంగా హరిహరమూర్తుల అంబారీ సేవను ఎత్తుకుని భక్తిభావాన్ని చాటుకున్నారు. ప్రధాన ఆలయం నుంచి ప్రారంభమైన పెద్దసేవ ఊరేగింపు పట్టణంలోని ప్రధాన వీధుల మీదుగా మండప హనుమాన్ ఆలయం, గడీ, బద్ది పోచమ్మ ఆలయం, శ్రీ భీమేశ్వరాలయం, అంబేడ్కర్ విగ్రహం మీదుగా తిరిగి ప్రధాన ఆలయానికి చేరుకుంది. మార్గమధ్యంలో పలుచోట్ల ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆలయ అర్చకులు, వేద పండితులు, అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



