మాదక ద్రవ్యాల వినియోగం, బాలలతో వాహనాలు నడిపించడం, సైబర్ నేరాలు, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల కలిగే ప్రమాదాలపై ప్రయాణికులకు అవగాహన కల్పించారు. జిల్లా బస్టాండ్ ఆవరణలో బుధవారం పోలీసు కళాబృందం ఆధ్వర్యంలో ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
జిల్లా పోలీసు అధికారి ఎం. రాజేష్‌చంద్ర ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో కళాబృందం సభ్యులు మాటలు, పాటల ద్వారా ప్రజలకు పలు సూచనలు చేశారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, బాలలతో వాహనాలు నడిపించవద్దని సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా శిరస్త్రాణం ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని తెలిపారు. సైబర్ నేరాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని, గుర్తుతెలియని వ్యక్తులకు పాస్వర్డ్లు, ఓటీపీలు, వ్యక్తిగత వివరాలు వెల్లడించవద్దని సూచించారు. సైబర్ మోసానికి గురైన వెంటనే 1930కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు సంబంధించిన సమాచారాన్ని 1908కు తెలియజేయాలని సూచించారు.
అత్యవసర పరిస్థితుల్లో 112కు ఫోన్ చేయాలని, మహిళల రక్షణకు షీ బృందాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. షీ బృందం 8712686094 నంబరును సంప్రదించవచ్చని పేర్కొన్నారు. దొంగతనాల నివారణకు అప్రమత్తంగా ఉండాలని, గుర్తుతెలియని వ్యక్తుల పట్ల జాగ్రత్త వహించాలని, రహదారి ప్రమాదాల నివారణకు నిబంధనలు పాటించాలని ప్రయాణికులకు సూచించారు.
కార్యక్రమంలో పోలీసు కళాబృందం ఇన్చార్జిలు రామంచ తిరుపతి, యు. శేషారావు, కానిస్టేబుళ్లు ప్రభాకర్, సాయిలు, షీ బృందం సభ్యులు భూమయ్య, ప్రవీణ, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రయాణికులు పాల్గొన్నారు.











