వెలిగొండ, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 09
వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం కోసం తమ ఇళ్లు, భూములను త్యాగం చేసిన నిర్వాసితుల పరిస్థితి దయనీయంగా మారింది. పునరావాసం, పరిహారంపై ఇచ్చిన హామీలు నెరవేర్చాలని బాధితులు కోరుతున్నారు. సుమారు 700 కుటుంబాలు కనీస సౌకర్యాలు లేని తాత్కాలిక గుడారాల్లో నివాసం ఉంటున్నాయి.
‘వెలిగొండ’ నిర్వాసితుల ఆర్తనాదాలు : వెలిగొండ ప్రాజెక్టు కోసం ఇళ్లు, సాగుభూములను త్యాగం చేసిన నిర్వాసితుల పరిస్థితి దయనీయంగా మారింది. పునరావాసం, పరిహారం కల్పిస్తామని ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టులోకి నీరు వస్తోందని అధికారులు గ్రామాలను ఖాళీ చేయించడంతో సుమారు 700 కుటుంబాలు పునరావాస కాలనీల్లో ప్లాస్టిక్ టార్పాలిన్లతో తాత్కాలిక గుడారాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారు. ఏడు పునరావాస కాలనీల్లో మంచినీరు, విద్యుత్తు వంటి కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు నిర్వాసితులు చెబుతున్నారు. వ్యవసాయం కోల్పోవడంతో ఉపాధి అవకాశాలు లేక పురుషులు పనుల కోసం పట్టణాల వైపు వెళ్తున్నారు. చిన్నారులు విద్యకు దూరమవుతున్న పరిస్థితి నెలకొంది. ఒన్‌టైం సెటిల్మెంట్ కింద రూ.12.50 లక్షల ప్యాకేజీ ప్రకటించినప్పటికీ ఇంకా సుమారు వెయ్యి మందికి పరిహారం అందాల్సి ఉందని బాధితులు పేర్కొంటున్నారు. నిర్వాసిత యువతకు రూ.2 లక్షల పరిహారం ప్రకటిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోపైనా వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముంపు గ్రామాల నుంచి హుటాహుటిన బయటకు రావడంతో ఇళ్లలోని విలువైన సామగ్రిని వదిలివేయాల్సి వచ్చిందని పలువురు వాపోతున్నారు. పరిహారం అందకపోవడం, పునరావాస కాలనీల్లో కనీస వసతులు లేకపోవడం, ఉపాధి కోల్పోవడంతో తమ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, అధికారులు వెంటనే స్పందించి పునరావాసం, పరిహారం, ఉపాధి కల్పించాలని నిర్వాసితులు కోరుతున్నారు.












