దేశ ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతోందని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ, గ్రామీణ కుటుంబాల బతుకులు భారంగా మారుతున్నాయి. పెరుగుతున్న ధరలు, పరిమిత ఆదాయాలు, తగ్గుతున్న పొదుపులు పల్లె ప్రజలను అప్పుల ఊబిలోకి నెడుతున్నాయి. కుటుంబ అవసరాలు తీర్చుకోవడానికే ఆదాయం సరిపోని పరిస్థితి నెలకొంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై నాబార్డ్ తాజా సర్వేలో ఈ చేదు నిజాలు వెల్లడయ్యాయి.
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అభివృద్ధి, ఆర్థిక ప్రగతి అంటూ ప్రచారం చేసుకుంటున్నప్పటికీ గ్రామీణ భారతంలో సామాన్య కుటుంబాల ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతోందని నాబార్డ్ సర్వే స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, జమ్మూకాశ్మీర్లోని 600 గ్రామాల్లో 6 వేల కుటుంబాల నుంచి వివరాలు సేకరించారు. సెప్టెంబర్లో గ్రామీణ ద్రవ్యోల్బణం 6.08 శాతానికి చేరింది. ఆగస్టులో 5.24 శాతం, జులైలో 4.84 శాతంగా నమోదైంది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ధరల భారం క్రమంగా పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో కుటుంబాల కొనుగోలు శక్తి దెబ్బతింటోంది.
ఆదాయం పెరిగింది కొద్దిమందికే
గత ఏడాదిలో తమ ఆదాయం పెరిగిందని 27.1 శాతం కుటుంబాలు మాత్రమే తెలిపాయి. నాబార్డ్ సర్వే ప్రారంభమైనప్పటి నుంచి ఇదే అత్యల్పం కావడం గమనార్హం. గతేడాది నవంబర్లో ఈ సంఖ్య 42.2 శాతంగా ఉంది. మరోవైపు 20.5 శాతం కుటుంబాల ఆదాయం తగ్గింది. 52.4 శాతం కుటుంబాల ఆదాయంలో ఎలాంటి మార్పు లేదు. ఆదాయం పెరిగిన కుటుంబాల్లోనూ సగటు పెరుగుదల 10.5 శాతానికే పరిమితమైంది. ధరలు పెరుగుతున్న వేగానికి అనుగుణంగా ఆదాయాలు పెరగడం లేదని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.
పొదుపునకు అవకాశం ఎంత
గ్రామీణ కుటుంబాల ఆదాయంలో పొదుపు వాటా చరిత్రలోనే కనిష్ట స్థాయికి పడిపోయింది. ప్రస్తుతం నెలవారీ ఆదాయంలో 12.6 శాతం మాత్రమే పొదుపు చేస్తున్నారు. 2020లో ఇది 16.8 శాతంగా ఉండేది. వచ్చిన ఆదాయంలో 65 శాతం నిత్యావసరాలు, ఇతర వినియోగ ఖర్చులకే వెచ్చిస్తున్నారు. మరో 13.2 శాతం రుణాల చెల్లింపులకు వెళ్తోంది. తమ ఆర్థిక పొదుపు తగ్గిందని 32.1 శాతం కుటుంబాలు వెల్లడించాయి. పెట్టుబడులు తగ్గిన కుటుంబాల వాటా కూడా సర్వేలో అత్యధికంగా 20.2 శాతానికి చేరింది.
ఆహారానికే ఆదాయంలో అధిక భాగం
కుటుంబాల నెలవారీ వినియోగ ఖర్చుల్లో ఆహారానికే 53.5 శాతం వెచ్చిస్తున్నారు. విద్య, వైద్యానికి 24.1 శాతం, వంటగ్యాస్, రవాణా వంటి ఇంధన అవసరాలకు 16.6 శాతం ఖర్చవుతోంది. ధరల ఒత్తిడి మరింత పెరుగుతుందని ప్రజలు భావిస్తున్నారు. వచ్చే మూడు నెలల్లో ధరలు 5 శాతం, ఏడాదిలో 5.9 శాతం పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. సామాన్యులపై ధరల భారం తగ్గించాల్సిన ప్రభుత్వానికి ఈ పరిస్థితి సవాలుగా మారుతోంది.
ప్రభుత్వ సబ్సిడీలు, ఆర్థిక బదిలీలు గ్రామీణ కుటుంబాల నెలవారీ ఆదాయంలో సగటున 8.3 శాతంగా ఉన్నాయి. ఏడాది క్రితం ఈ వాటా 9.3 శాతంగా ఉండేది. పీఎం కిసాన్, ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన వంటి పథకాల ద్వారా సాయం అందుతున్నప్పటికీ.. కుటుంబాల మొత్తం ఆర్థిక కష్టాలను అధిగమించేందుకు ఆ సాయం సరిపోవడం లేదనే పరిస్థితి కనిపిస్తోంది.












