ఖరీఫ్ (వానాకాలం) వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను సాఫీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ కలెక్టరేట్లో సోమవారం నిర్మల్ జిల్లాకు సంబంధించి వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియపై జిల్లా అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ధాన్యం కొనుగోలుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని సూచించారు. నిర్ణీత సమయానికి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ఆదేశించారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో రైతులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని, కొనుగోలుకు సంబంధించిన సామగ్రిని సమకూర్చుకోవాలని తెలిపారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి, ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో ఇన్చార్జి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రాథోడ్ రమేష్, ఆర్డీవో దేవీదాస్, పౌరసరఫరాల అధికారులు రాజేందర్, సుధాకర్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.












