నియోజకవర్గంలో 50 వేల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో చేపడుతున్న 28వ ప్యాకేజీ పనులపై అంచనాలు తయారు చేసి, తక్షణమే ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ముధోల్, తానుర్, కుభీర్ మండలాల్లోని ఆయా గ్రామాల్లో సాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకుంది.
నియోజకవర్గంలో 50 వేల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో చేపడుతున్న 28వ ప్యాకేజీ పనులపై అంచనాలు తయారు చేసి, తక్షణమే ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సూచించారు. ఇటీవల ఎమ్మెల్యే 28వ ప్యాకేజీకి 500 కోట్ల రూపాయల నిధులు ఇవ్వాలని అసెంబ్లీ సమావేశాల్లో కోరిన విషయం విదితమే. అందులో భాగంగానే బుధవారం భైంసాలోని ఎమ్మెల్యే నివాసంలో ఇరిగేషన్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. పదేళ్లుగా ప్యాకేజీ పనులు ముందుకు సాగకపోవడంతో, పనులు ఎంతవరకు చేపట్టారు, ప్రస్తుతం చేపట్టాల్సిన పనులేమిటని అధికారులను ఆయన అడిగి తెలుసుకున్నారు. గతంలో 48 శాతం పనులు పూర్తయ్యాయని, ప్రస్తుతం మిగిలిన పనులకు ఎన్ని నిధులు అవసరమన్న విషయంపై చర్చించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ముధోల్, తానుర్, కుభీర్ మండలాల్లోని ఆయా గ్రామాల్లో 50 వేల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకుంది. అధికారులు విభాగాల వారీగా అంచనాలు తయారుచేసి ప్రభుత్వానికి తక్షణమే నివేదిక సమర్పించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పటేల్ మాట్లాడుతూ, 28వ ప్యాకేజీ పనులు పూర్తయితే, గోదావరి నది జలాల ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ తో ముధోల్ నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుందని అన్నారు. రెండు సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ విషయమై పలుమార్లు అసెంబ్లీలో ప్రస్తావించగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. త్వరలోనే ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో ఇరిగేషన్ శాఖ ఎస్.ఇ. రాజేంద్రప్రసాద్, ఈఈ ప్రవీణ్, డి.ఇ. నవీన్ తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.












