జిల్లా పిల్లలమర్రి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఖమ్మం మమత ఆసుపత్రిలో పనిచేస్తున్న ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ కాసకుర్తి జగదీష్.. అత్యాధునిక వోల్వో కారులో ప్రయాణిస్తుండగా, కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు మంటల్లో చిక్కుకోవడంతో డాక్టర్ జగదీష్ సజీవ దహనమయ్యారు.
ఖమ్మంహైదరాబాద్ 365బీబీ జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. డాక్టర్ జగదీష్ ప్రయాణిస్తున్న వోల్వో కారు అదుపుతప్పి రహదారి మధ్యలోని డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న వెంటనే కారులో మంటలు చెలరేగి, కొద్దిసేపటికే మొత్తం వాహనాన్ని చుట్టుముట్టాయి. మంటల తీవ్రతకు కారు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదం జరిగిన వెంటనే మంటలు తీవ్రంగా వ్యాపించడంతో కారులో చిక్కుకున్న డాక్టర్ జగదీష్ బయటకు రాలేకపోయినట్లు ప్రాథమిక సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటల తీవ్రతకు వాహనం పూర్తిగా దగ్ధం కావడంతో, తొలుత మృతుడి గుర్తింపులోనూ ఇబ్బందులు ఎదురయ్యాయి. అనంతరం వివిధ ఆధారాల ద్వారా మృతుడు డాక్టర్ జగదీష్గా గుర్తించారు.
ఖరీదైన వాహనాల్లో అత్యాధునిక భద్రతా వ్యవస్థలు ఉన్నప్పటికీ, తీవ్రమైన ప్రమాదం జరిగినప్పుడు ప్రయాణికులు సురక్షితంగా బయటపడే అవకాశం ఎంతవరకు ఉంటుంది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రమాదం అనంతరం కారులో మంటలు చెలరేగడానికి గల కారణాలపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. కారు డోర్లు సాంకేతిక లోపం వల్ల తెరుచుకోలేదా, లేక ఇంధన లీకేజీ లేదా విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ వంటివి కారణమయ్యాయా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. కారు అదుపుతప్పడానికి గల కారణాలు, ప్రమాద సమయంలో పరిస్థితులు, మంటలు ఎలా చెలరేగాయన్న అంశాలపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ జగదీష్ అకాల మరణంతో ఖమ్మం వైద్య వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఊహించని రీతిలో జరిగిన ఈ ఘోర ప్రమాదం ఆయన కుటుంబ సభ్యులను, సహచర వైద్యులను, పరిచయస్తులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.












