నిజామాబాద్ పట్టణంలో గణేష్ నిమజ్జన శోభాయాత్రల నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు, దారి మళ్లింపులు అమలు చేయనున్నట్లు పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య తెలిపారు. ఈ ఆంక్షలు ఉదయం 11 గంటల నుంచి 26వ తేదీ ఉదయం 11 గంటల వరకు అమల్లో ఉంటాయి.
హైదరాబాద్ వైపు నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలు మాధవనగర్ బైపాస్, కంటేశ్వర్ బైపాస్, రైల్వే అండర్‌పాస్, ఎన్టీఆర్ చౌరస్తా, రైల్వే స్టేషన్ మీదుగా బస్టాండ్‌కు చేరుకోవాలని సూచించారు.
బోధన్ వైపు నుంచి వచ్చే వాహనాలు అర్షపల్లి చౌరస్తా వద్ద ఎడమవైపు తిరిగి బైపాస్, కొత్త కలెక్టరేట్, కంటేశ్వర్ బైపాస్, రైల్వే అండర్‌పాస్, ఎన్టీఆర్ చౌరస్తా మీదుగా బస్టాండ్‌కు వెళ్లాలి.
ఆర్మూర్ వైపు నుంచి వచ్చే వాహనాలు కంటేశ్వర్ బైపాస్ నుంచి రైల్వే అండర్‌పాస్, ఎన్టీఆర్ టీ జంక్షన్ మీదుగా రైల్వే స్టేషన్ ముందు నుంచి బస్టాండ్‌కు చేరుకోవాలని పోలీసులు సూచించారు.
బాన్సువాడ, వర్ని వైపు నుంచి వచ్చే వాహనాలు వర్ని చౌరస్తా, ఆర్ఆర్ చౌరస్తా, పులాంగ్, ఎల్లమ్మగుట్ట, కోర్టు చౌరస్తా, ఎన్టీఆర్ చౌరస్తా మీదుగా బస్టాండ్‌కు చేరుకోవాలి.
భారీ వాహనాలకు ఆంక్షలు
ఉదయం 11 గంటల నుంచి 26వ తేదీ ఉదయం 11 గంటల వరకు భారీ వాహనాలు నగరంలోకి ప్రవేశించరాదని పోలీసులు స్పష్టం చేశారు.
విగ్రహాల ఎత్తుపై సూచన
కంటేశ్వర్ రైల్వే అండర్‌పాస్ ఎత్తు 13 అడుగులు మాత్రమే ఉన్నందున, 13 అడుగుల లోపు విగ్రహాలు మాత్రమే అండర్‌పాస్ గుండా వెళ్లాలని సూచించారు. అంతకంటే ఎత్తైన విగ్రహాలు ప్రధాన శోభాయాత్ర రథం వెళ్లిన అనంతరం రైల్వే ఫ్లైఓవర్ మీదుగా వెళ్లాలని పోలీసులు తెలిపారు.
ప్రజలు ట్రాఫిక్ మళ్లింపులను గమనించి పోలీసులకు సహకరించాలని పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య కోరారు.












