తెలంగాణలో కృత్రిమ మేధ (ఏఐ) వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో, డేటా సెంటర్ల ఏర్పాటుకు అమెరికా ఆసక్తి చూపుతోంది. రాష్ట్రంలోని సింగరేణి ప్రాంతాల్లో డేటా సెంటర్లను ఏర్పాటు చేయడానికి అనువైన ప్రాంతాలను పరిశీలిస్తున్నట్లు హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ ప్రతినిధి బృందం వెల్లడించింది. ఈ మేరకు శుక్రవారం సింగరేణి భవన్లో జరిగిన సమావేశంలో ఈ విషయం వెల్లడైంది.
హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ రాజకీయ, ఆర్థిక విభాగం చీఫ్ మెరెడిత్ మెజ్లర్ నేతృత్వంలోని బృందం సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సీఎండీ బుద్ధప్రకాశ్ జ్యోతితో సమావేశమైంది. ఈ భేటీలో డేటా సెంటర్ల ఏర్పాటు, కీలక ఖనిజాల రంగంలో పెట్టుబడులు, సాంకేతిక సహకారం, విద్యుత్ ఉత్పత్తి వంటి అంశాలపై చర్చించారు.
కృత్రిమ మేధ ఆధారిత సేవలు, సాంకేతిక పరిజ్ఞానం విస్తరిస్తుండటంతో డేటా సెంటర్లకు డిమాండ్ పెరుగుతోందని అమెరికా ప్రతినిధులు తెలిపారు. వీటి ఏర్పాటుకు నిరంతర విద్యుత్ సరఫరా, తగినంత నీటి లభ్యత అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. తెలంగాణలో ఇప్పటికే పలు అమెరికా సంస్థలు డేటా సెంటర్లను ఏర్పాటు చేశాయని, మరికొన్ని సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయని వివరించారు. సింగరేణి ప్రాంతంలో అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు ఇలాంటి ప్రాజెక్టులకు అనుకూలంగా ఉంటాయని అభిప్రాయపడ్డారు.
సింగరేణి విద్యుత్ ప్రాజెక్టులు
ఈ సందర్భంగా సింగరేణి అధికారులు తమ సంస్థ చేపట్టనున్న విద్యుత్ ప్రాజెక్టుల గురించి అమెరికా బృందానికి వివరించారు. ఇప్పటికే బొగ్గు తవ్వకాలు పూర్తయిన ఓపెన్‌కాస్ట్ గనులను వినియోగించుకుని పలు ప్రాంతాల్లో పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్లు తెలిపారు. ఈ కేంద్రాల ద్వారా విద్యుత్ డిమాండ్ అధికంగా ఉండే సమయాల్లోనూ డేటా సెంటర్లకు నిరంతరాయంగా విద్యుత్ అందించే అవకాశం ఉంటుందని వివరించారు. అవసరమైన పెట్టుబడులు, భాగస్వామ్యాల ద్వారా ఈ ప్రాజెక్టులను అభివృద్ధి చేయవచ్చని పేర్కొన్నారు. సమీపంలోని గోదావరి నది నుంచి నీటిని వినియోగించుకునే అవకాశాన్ని కూడా పరిశీలించవచ్చని తెలిపారు.
కీలక ఖనిజాల రంగంలోనూ భాగస్వామ్యం
డేటా సెంటర్లతో పాటు కీలక ఖనిజాల అన్వేషణ, వెలికితీత రంగాల్లోనూ అమెరికా సంస్థలతో కలిసి పనిచేయడానికి సింగరేణి ఆసక్తి చూపుతోంది. బొగ్గు గనుల నిర్వహణలో ఉన్న అనుభవాన్ని ఉపయోగించుకుని కీలక ఖనిజాల రంగంలోకి ప్రవేశించినట్లు సీఎండీ బుద్ధప్రకాశ్ జ్యోతి వివరించారు. ఇప్పటికే పలు దేశాలతో సంయుక్త భాగస్వామ్యాలు, సాంకేతిక సహకారానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.
కొత్తగూడెంలో ఇటీవల ఏర్పాటు చేసిన జియో సైన్స్ ప్రయోగశాలపై అమెరికా ప్రతినిధులు ప్రత్యేక ఆసక్తి కనబరిచారు. ఓపెన్‌కాస్ట్ గనుల నుంచి వెలువడే మట్టి, వ్యర్థ పదార్థాల్లో అరుదైన భూ మూలకాలు (రేర్ ఎర్త్ ఎలిమెంట్స్) ఉన్నాయా వాటిని వెలికితీసే అవకాశాలు ఏమిటి అనే అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. ఈ రంగంలో విదేశీ పెట్టుబడులు, సాంకేతిక సంస్థలు, పరిశోధనా సంస్థలతో భాగస్వామ్యాలను ఏర్పాటు చేసుకోవాలని సింగరేణి భావిస్తున్నట్లు సీఎండీ తెలిపారు.
వచ్చే ఏడాది ఏప్రిల్‌లో అమెరికాలో నిర్వహించనున్న కీలక ఖనిజాల సదస్సుకు హాజరు కావాలని అమెరికా ప్రతినిధులు సింగరేణి సంస్థను ఆహ్వానించారు. సింగరేణి గనులు, కొత్తగూడెంలోని జియో సైన్స్ ప్రయోగశాలను సందర్శించి, సంస్థ కార్యకలాపాలను ప్రత్యక్షంగా పరిశీలించాలని అమెరికా బృందానికి సీఎండీ ఆహ్వానం పలికారు.











