పండుగల వేళ బాణసంచా కొనుగోళ్లు జోరుగా సాగుతున్న నేపథ్యంలో జిల్లా ఆర్మూర్ పట్టణంతో పాటు పెర్కిట్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన టపాకాయల విక్రయ కేంద్రాలపై అధికారుల పర్యవేక్షణ ఉందా అనే ప్రశ్నలు ప్రజల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి. దుకాణాల ఏర్పాటుకు అవసరమైన అనుమతులు తీసుకున్నారా లైసెన్సుల నిబంధనల ప్రకారమే బాణసంచా నిల్వ చేసి విక్రయిస్తున్నారా అనే అంశాలపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
లైసెన్సులు, అనుమతులపై తనిఖీలు అవసరం
బాణసంచా నిల్వ, విక్రయాలకు సంబంధించి పేలుడు పదార్థాల చట్టం, 1884, పేలుడు పదార్థాల నిబంధనలు, 2008 ప్రకారం నిర్దేశించిన నిబంధనలు అమలులో ఉన్నాయి. ప్రతి విక్రయ కేంద్రానికి సంబంధిత శాఖల నుంచి చెల్లుబాటు అయ్యే లైసెన్సు ఉండటంతో పాటు, అందులో పేర్కొన్న పరిమితులకు లోబడే టపాకాయలను నిల్వ చేసి విక్రయించాల్సి ఉంటుంది. అయితే ఆర్మూర్ పట్టణం, పెర్కిట్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన దుకాణాల్లో ఈ నిబంధనలు ఎంతవరకు అమలవుతున్నాయో అధికారులు పరిశీలించాల్సిన అవసరం ఉంది.
స్థల అనుమతులు, భద్రతపై దృష్టి సారించాలి
బహిరంగ ప్రదేశాలు, రహదారుల పక్కన, ప్రైవేటు స్థలాల్లో ఏర్పాటు చేస్తున్న తాత్కాలిక బాణసంచా దుకాణాలకు అవసరమైన అనుమతులు ఉన్నాయా స్థల యజమానుల అంగీకారం ఉందా లైసెన్సులో పేర్కొన్న ప్రాంగణంలోనే విక్రయాలు జరుగుతున్నాయా ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా, అగ్నిప్రమాదాలకు ఆస్కారం లేకుండా దుకాణాలను ఏర్పాటు చేశారా అనే అంశాలపై మున్సిపల్, పోలీస్, సంబంధిత లైసెన్సింగ్ అధికారులు దృష్టి సారించాల్సి ఉంది.
ఫైర్ ఇంజన్ లేకపోతే ప్రమాద తీవ్రత పెరిగే అవకాశం
మరోవైపు ఆర్మూర్ పట్టణంలో అగ్నిప్రమాదాలు సంభవిస్తే తక్షణమే స్పందించేందుకు ఫైర్ ఇంజన్ అందుబాటులో లేకపోవడం ఆందోళన కలిగించే అంశంగా మారుతోంది. బాణసంచా దుకాణాలు అధికంగా ఉన్న సమయంలో అనుకోని అగ్నిప్రమాదం చోటుచేసుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రమాదం జరిగిన తర్వాత ఫైర్ ఇంజన్ వచ్చే వరకు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడితే ప్రాణ, ఆస్తి నష్టం జరిగే ప్రమాదం ఉంది. కనీసం పండుగల సమయంలోనైనా ఆర్మూర్ పట్టణంలో ఫైర్ ఇంజన్ను అందుబాటులో ఉంచడంతో పాటు, అగ్నిమాపక సిబ్బందిని అప్రమత్తంగా ఉంచాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రతి దుకాణంలో అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉన్నాయా అనుమతించిన పరిమితికి మించి బాణసంచా నిల్వ చేశారా తయారీదారుల వివరాలు, ఉత్పత్తుల గుర్తింపు వివరాలు సక్రమంగా ఉన్నాయా నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నారా అనే అంశాలను అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాలి. నిబంధనలకు విరుద్ధమైన లేదా నాసిరకం బాణసంచా విక్రయిస్తున్నట్లు గుర్తిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి.
జిల్లా కలెక్టర్, పోలీస్ శాఖ, అగ్నిమాపక శాఖ, మున్సిపల్ అధికారులు, సంబంధిత లైసెన్సింగ్ అధికారులు, పేలుడు పదార్థాల భద్రతా సంస్థ () సమన్వయంతో తనిఖీలు నిర్వహిస్తే వాస్తవ పరిస్థితులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రమాదాలు జరిగిన తర్వాత స్పందించడం కంటే ముందస్తు తనిఖీలతో ప్రమాదాలను నివారించడం ఎంతో మేలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.








