భైంసా పట్టణ సమగ్రాభివృద్ధికి మాస్టర్ ప్లాన్ కీలకంగా దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. పట్టణంలో పెరుగుతున్న జనాభా, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు మాస్టర్ ప్లాన్‌ను రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు బుధవారం భైంసా పురపాలక కార్యాలయంలో రెండో కన్సల్టేటివ్ వర్క్‌షాప్ నిర్వహించారు.
మాస్టర్ ప్లాన్‌పై సంబంధిత స్టేక్హోల్డర్లతో ఇప్పటికే కలెక్టరేట్లో తొలి కన్సల్టేటివ్ సమావేశం నిర్వహించినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రస్తుత ముసాయిదా మాస్టర్ ప్లాన్‌పై అధికారులకు, ప్రజాప్రతినిధులకు, సంబంధిత వర్గాలకు ఏవైనా సందేహాలు, అభ్యంతరాలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. తాజా గణాంకాల ప్రకారం భైంసా పట్టణ జనాభా సుమారు 60 వేల వరకు ఉందని, భవిష్యత్‌లో జనాభా మరింత పెరిగే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా పట్టణ ప్రణాళిక ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. 2040 నాటికి పట్టణ అవసరాలను దృష్టిలో ఉంచుకొని రహదారులు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు, మైదానాలు, పార్కులు తదితర మౌలిక సదుపాయాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్‌లో ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అందరి సహకారం, సూచనలతో భైంసా మాస్టర్ ప్లాన్‌ను అమలు చేసి పట్టణ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేద్దామని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. మాస్టర్ ప్లాన్ అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా రూపొందించాలని సూచించారు. ముసాయిదా మాస్టర్ ప్లాన్‌పై ఎవరికైనా సందేహాలు, అభ్యంతరాలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు.
ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా పారిశ్రామిక, వాణిజ్య, నివాస ప్రాంతాలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని, పట్టణ మౌలిక వసతుల మెరుగుదలకు మాస్టర్ ప్లాన్ ఎంతో కీలకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కన్సల్టేటివ్ వర్క్‌షాప్‌లో డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ అండ్ కంట్రీ ప్లానింగ్ ఏడీ అశ్విని పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ముసాయిదా మాస్టర్ ప్లాన్‌ను వివరించారు. పారిశ్రామిక, వాణిజ్య, నివాస జోన్లకు సంబంధించిన పటాలను, భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలను సమగ్రంగా వివరించారు. ముసాయిదా మాస్టర్ ప్లాన్‌పై పలువురు వ్యక్తం చేసిన సందేహాలను ఆమె నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దత్తాత్రి, వైస్ చైర్మన్ కుతిజా సిద్దికీ, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఏఎస్పీ సాయి కిరణ్, మున్సిపల్ కమిషనర్ సంతోష్ కుమార్, కౌన్సిల్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.











