నిర్మల్ జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిలపై సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ముధోల్ నియోజకవర్గం అన్న భావు సాటె కమిటీ సభ్యుడు గైక్వాడ్ సాయినాథ్ మాదిగ తీవ్రంగా ఖండించారు. ఎస్పీ చేపట్టిన కార్యక్రమాలను ప్రశంసించారు.
తానుర్, సెప్టెంబరు 22: నిర్మల్ జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిలపై కొందరు సామాజిక మాధ్యమాల వేదికగా చేస్తున్న తప్పుడు, నిరాధార, కుట్రపూరిత దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ముధోల్ నియోజకవర్గం అన్న భావు సాటె కమిటీ సభ్యుడు గైక్వాడ్ సాయినాథ్ మాదిగ తెలిపారు. ఎస్పీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జిల్లాలో మహిళలు, చిన్నారుల భద్రత కోసం పోలీస్ అక్క కార్యక్రమం, అవినీతి నిర్మూలన, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు అణగారిన వర్గాలు, గిరిజనులు, మహిళలు, యువత సమస్యల పరిష్కారానికి ఆమె చర్యలు తీసుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఎలాంటి ఆధారాలు, రుజువులు లేకుండా వ్యక్తిగత కక్షతో కొందరు చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని ఆయన కోరారు.
సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టులు చేస్తున్న వారిపై సైబర్ క్రైమ్ విభాగం ద్వారా విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీ జానకి షర్మిలకు పూర్తి అండగా నిలవాలని, ఆమె మనోధైర్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. నిర్మల్ జిల్లాకు నిజాయితీగా, సమర్థవంతంగా పనిచేస్తున్న ఎస్పీ లభించడం తమకు సంతోషకరమని, ఆమెకు తమ పూర్తి మద్దతు, అండదండలు ఎల్లప్పుడూ ఉంటాయని గైక్వాడ్ సాయినాథ్ మాదిగ తెలిపారు. దుష్ప్రచారం కొనసాగితే ప్రజలు, యువత, ప్రజా సంఘాలు, బహుజన సంఘాలను కలుపుకొని నిరసన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు.












