నిర్మల్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా హాజరై గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం కోసం మహాత్మా గాంధీ జీవితాంతం పోరాడారని, శాంతి, అహింస మార్గాల ద్వారా దేశ ప్రజలను స్వాతంత్ర్య ఉద్యమంలో సంఘటితం చేసి ముందుకు నడిపించారని పేర్కొన్నారు. గాంధీజీ జీవితాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని, సమాజంలోని రుగ్మతలను నిర్మూలించడంతో పాటు దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు.
జిల్లా ఇన్చార్జి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రాథోడ్ రమేష్ మాట్లాడుతూ.. సత్యం, శాంతి, అహింస మార్గాల్లో పయనిస్తూ గాంధీజీ దేశ స్వాతంత్ర్యం కోసం తన జీవితాన్ని త్యాగం చేశారని తెలిపారు. గాంధీజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని, దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని కోరారు.
ఈ సందర్భంగా పలువురు జిల్లా అధికారులు గాంధీజీ గొప్పతనాన్ని, స్వాతంత్ర్య ఉద్యమంలో ఆయన పోషించిన కీలక పాత్రను స్మరించుకున్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.












