భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులకు, ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో రాణించాలనుకునే యువ క్రీడాకారులకు ప్రభుత్వ సంస్థల నుంచి నిరంతర ఆర్థిక సహకారం అవసరమని స్టార్ షట్లర్ పీవీ సింధు అభిప్రాయపడ్డారు. స్పాన్సర్లు లేకపోతే విదేశీ టోర్నీల్లో పాల్గొనడం, కోచ్‌లు, ఫిజియోథెరపిస్టులు, ఇతర సహాయక సిబ్బందిని వెంట తీసుకెళ్లడం కష్టమవుతోందని ఆమె తెలిపారు.
క్రీడాకారులకు నిధులు కేటాయించడాన్ని ప్రభుత్వ వ్యవస్థపై భారంగా చూడకూడదని, అది దేశ క్రీడా భవిష్యత్తుపై పెట్టుబడిగా భావించాలని సింధు పేర్కొన్నారు. ఇటీవల యూరప్‌లో జరిగిన నాలుగు టోర్నీలకు భారత క్రీడా ప్రాధికార సంస్థ () నుంచి ఆశించిన ఆర్థిక సహాయం అందకపోవడంతో పలువురు క్రీడాకారులు తమ ఖర్చులను తామే భరించాల్సి వచ్చింది. ఈ పర్యటనలో పీవీ సింధు, లక్ష్యసేన్ తమ విభాగాల్లో జర్మనీలోని హైలో ఓపెన్ టైటిళ్లను గెలుచుకున్నారు.
ఈ వ్యవహారంపై సామాజిక మాధ్యమం ఎక్స్‌లో స్పందించిన సింధు, బ్యాడ్మింటన్, టెన్నిస్ క్రీడల్లో లభించే ప్రైజ్‌మనీ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రస్తావించారు. వింబుల్డన్‌లో తొలి రౌండ్లోనే ఓడిపోయిన టెన్నిస్ ఆటగాడికి సుమారు 80 వేల పౌండ్ల ప్రైజ్‌మనీ లభిస్తుండగా, బ్యాడ్మింటన్‌లో అత్యధిక ప్రైజ్‌మనీ ఇచ్చే టోర్నీల్లో ఒకటైన చైనా ఓపెన్ విజేతకు 1.40 లక్షల డాలర్లు మాత్రమే దక్కుతున్నాయని వివరించారు. అదే టోర్నీలో తొలి రౌండ్లో ఓడితే సుమారు 2 వేల డాలర్లు మాత్రమే వస్తాయని పేర్కొన్నారు.
అయితే రెండు క్రీడల్లోనూ ప్రయాణం, కోచ్‌లు, ఫిజియోథెరపిస్టులు, శిక్షకులు, సహాయక బృందాల ఖర్చులు దాదాపు ఒకే స్థాయిలో ఉంటాయని ఆమె తెలిపారు. ఈ వ్యత్యాసంపై భారత టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్నతో కూడా చర్చించినట్లు వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటికే పేరు సంపాదించిన క్రీడాకారులు స్వయంగా తమ ఖర్చులను భరించే స్థాయికి ఎదగాలని తాను కూడా అంగీకరిస్తున్నట్లు సింధు చెప్పారు.
తనకు మంచి స్పాన్సర్లు ఉండటంతో విదేశీ పర్యటనలకు అవసరమైన నిధులను సమకూర్చుకోగలుగుతున్నానని, కానీ ప్రతి క్రీడాకారుడికి అలాంటి అవకాశం ఉండదని వివరించారు. అందుకే ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ () వంటి సంస్థలు యువ ప్రతిభావంతులకు అండగా నిలవడం ముఖ్యమని పేర్కొన్నారు. యూరప్ పర్యటనలో నిధుల కొరత కారణంగా కొందరు యువ క్రీడాకారులు కోచ్‌లు లేకుండానే పోటీల్లో పాల్గొన్నారని, మరికొందరు ఖర్చులు భరించలేక టోర్నీల నుంచి తప్పుకున్నారని సింధు ఆందోళన వ్యక్తం చేశారు.
ఫ్రెంచ్ ఓపెన్‌లో భారత క్రీడాకారిణి అశ్మిత చలిహా జపాన్‌కు చెందిన అకానే యమగుచిపై విజయం సాధించినప్పుడు మరో భారత షట్లర్ ఇషారాణి బరువా ఆమెకు కోచ్‌గా సహకరించారు. డెన్మార్క్ ఓపెన్‌లో యువ క్రీడాకారిణి తన్వి శర్మ కూడా కోచ్ సహాయం లేకుండానే ఆడాల్సి వచ్చింది. యూరప్ పర్యటనలో డెన్మార్క్ ఓపెన్ నుంచి ఆరుగురు, ఫ్రెంచ్ ఓపెన్ నుంచి ఏడుగురు, హైలో ఓపెన్ నుంచి తొమ్మిది మంది భారత ఆటగాళ్లు వైదొలిగినట్లు నివేదికలు వెల్లడించాయి.
నేను నా పర్యటనకు అవసరమైన నిధులను ఎలాగోలా సమకూర్చుకోగలను. కానీ భవిష్యత్తులో మరో సింధు లేదా లక్ష్యసేన్ కావాలని కలలు కంటున్న 18 ఏళ్ల యువ క్రీడాకారుడి పరిస్థితి ఏమిటి అని ఆమె ప్రశ్నించారు. ప్రభుత్వం, భారత క్రీడా ప్రాధికార సంస్థ గతంలో క్రీడాకారులకు అందించిన సహకారాన్ని సింధు ప్రశంసించారు. అయితే క్రీడాకారులకు మద్దతు ఇవ్వడాన్ని ప్రభుత్వ వ్యవస్థపై భారం పడటంగా చూడటం సరికాదని, భారత క్రీడా రంగ భవిష్యత్తు కోసం చేసే పెట్టుబడిగా పరిగణించాలని ఆమె సూచించారు.












