కులం, మతం, వర్గం అనే తేడాలు లేకుండా సమాజంలోని ప్రతి ఒక్కరూ సమానమేనని చెప్పడమే కాదు.. ఆ సమానత్వాన్ని చేతల్లో చూపించడం కూడా ముఖ్యమని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చాటిచెప్పారు. అంటరానితనం, కులవివక్ష వంటి సామాజిక రుగ్మతలు ఇంకా అక్కడక్కడా కనిపిస్తున్న తరుణంలో, రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలోని మండల కేంద్రంలో ఓ దళిత నాయకుడి ఇంట్లో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సహపంక్తి భోజనం చేయడం చర్చనీయాంశంగా మారింది. గ్రామ సర్పంచ్, దళిత కాంగ్రెస్ నాయకుడు కొమ్ము కృష్ణ ఇంటికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేరుకున్నారు. కొమ్ము కృష్ణ దంపతులు స్వయంగా వండిన భోజనాన్ని మంత్రికి, ఎమ్మెల్యేకు ఆప్యాయంగా వడ్డించారు. వారి ఆతిథ్యాన్ని స్వీకరించిన మంత్రి, ఎమ్మెల్యే, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, దళితవాడలో దళిత నాయకుడి ఇంట్లో భోజనం చేయడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని, ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ, అన్నమయ్య తన సంకీర్తనలో చెప్పినట్లుగా ఈ సృష్టిలో అందరూ సమానులేనని, రాజు అయినా, సామాన్యుడైనా, బ్రాహ్మణుడైనా, చండాలుడైనా అందరిలోనూ పరబ్రహ్మ స్వరూపం ఒక్కటేనని వివరించారు. సమాజంలో మనుషుల మధ్య కులం, మతం, ఆర్థిక స్థితిగతుల ఆధారంగా వివక్ష చూపడం సరికాదని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల అభ్యున్నతికి కట్టుబడి ఉందని, ముఖ్యంగా దళితుల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. దళితులు బలంగా ఉంటేనే సమాజం బలంగా ఉంటుందని, వారి అభివృద్ధి ద్వారానే సమానత్వంతో కూడిన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని అన్నారు. కేవలం ఓట్ల కోసం దళితులను ఉపయోగించుకునే వారు కొందరుంటారని, కానీ వారి అభ్యున్నతిని నిజంగా ఆకాంక్షిస్తూ అండగా నిలిచేది కాంగ్రెస్ పార్టీయేనని ఆయన పేర్కొన్నారు. కులవివక్షకు తావులేకుండా ప్రతి ఒక్కరినీ గౌరవించే సమాజ నిర్మాణమే తమ ఆశయమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ తెలిపారు. రాజకీయ నాయకుల మాటలకు మించి వారి చేతల్లోనే సమానత్వ భావన ప్రతిబింబించాలని, లో జరిగిన ఈ సహపంక్తి భోజనం సామాజిక సమానత్వానికి ఒక మంచి సందేశమని స్థానిక నాయకులు అభిప్రాయపడ్డారు.












