జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో త్వరలో భారీ రైతు గర్జన సభ నిర్వహించనున్నట్లు పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ తెలిపారు. ఈ సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో త్వరలో భారీ రైతు గర్జన సభ నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ తెలిపారు. ఈ సభకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు ఆయన వెల్లడించారు. ఈరోజు జిల్లా కేంద్రంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, నియోజకవర్గ బాధ్యులు రాంకిషన్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు మారుగొండ రాము, అయ్యన్నగారి రాజేందర్, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ లోలం శ్యాంసుందర్ కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో భూక్యా జాన్సన్ నాయక్ మాట్లాడారు. ఇది కాలం తెచ్చిన కరవు కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరవు అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితులకు ప్రభుత్వ విధానాలు, హామీల అమలులో జరుగుతున్న జాప్యమే కారణమని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రైతులకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయడంలో విఫలమైందని, దీంతో అన్నదాతలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ నాయకత్వంలో రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్ వంటి పథకాలతో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇచ్చామని గుర్తుచేశారు. ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన రైతు డిక్లరేషన్, హామీల అమలులో వైఫల్యాలను రైతు గర్జన సభ వేదికగా ప్రజల ముందుంచి ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు. రైతుల కష్టాలు, కన్నీళ్లు ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నిస్తూ.. అన్నదాతల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న రైతు గర్జన సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల నుంచి రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని భూక్యా జాన్సన్ నాయక్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో , ముధోల్, ఖానాపూర్ నియోజకవర్గాల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


