ఢిల్లీలో జరిగిన దళితఆదివాసీ ఆత్మగౌరవ సదస్సులో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఉత్తరాఖండ్లో అవమానించిన ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. ఇది రాజ్యాంగ విలువలకు, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు.
ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఎస్సీ, ఎస్టీ ఎంపీల ఫోరం ఆధ్వర్యంలో దళితఆదివాసీ ఆత్మగౌరవ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మల్లికార్జున ఖర్గే సభ నిర్వహించిన ప్రదేశాన్ని అనంతరం శుద్ధీకరణ పేరుతో కార్యక్రమం నిర్వహించడం ప్రజాస్వామ్య విలువలకు, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు.
దేశాన్ని నడిపించే బాధ్యతలో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి ఘటనలపై స్పందించి, రాజ్యాంగ హక్కులను కాపాడాల్సిన అవసరం ఉందని భట్టి విక్రమార్క అన్నారు. ప్రజా ప్రతినిధి పాల్గొన్న ప్రదేశాన్ని శుద్ధి చేయడం వంటి చర్యలు సమాజంలో వివక్షపూరిత భావజాలం కొనసాగుతోందనే ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు.
రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్ చూపిన సమానత్వ మార్గంలో సాగాల్సిన సమయంలో.. ఒక దళిత నాయకుడిని అవమానించేలా వ్యవహరించడం బాధాకరం. ఇది మల్లికార్జున ఖర్గేకు జరిగిన అవమానం కాదు.. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, సామాజిక సమానత్వానికి జరిగిన అవమానం అని ఆయన అభివర్ణించారు.
ఘటనపై బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ నేతలు పోలీసులను ఆశ్రయిస్తే, ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేయాల్సిన ప్రభుత్వం నిరసన తెలిపిన వారిపైనే కేసులు పెట్టడం ఏ విధమైన ప్రజాస్వామ్య పద్ధతి అని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం తీరు ఆందోళన కలిగిస్తోందని అన్నారు.
దేశంలో ప్రతి పౌరుడికి సమాన గౌరవం, హక్కులు, అవకాశాలు కల్పించడమే రాజ్యాంగం నిర్దేశించిన మార్గమని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. కులం, మతం, ప్రాంతం ఆధారంగా ఎవరినీ అవమానించే పరిస్థితులు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.
ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలకు స్థానం ఉంటుందని, రాజకీయ ప్రత్యర్థిని గౌరవించడం ప్రజాస్వామ్య సంస్కృతిలో భాగమని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వ్యవస్థలే వివక్షకు తావిచ్చే చర్యలపై మౌనం వహిస్తే.. అది దేశ ప్రజాస్వామ్య విలువలకు ప్రమాదకరం అని హెచ్చరించారు.












