ఎన్నికల కమిషన్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో, భారత ఎన్నికల ప్రధాన అధికారి (సిఇసి) జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని కోరుతూ ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మిర్యాలగూడలోని అమరవీరుల స్తూపం వద్ద సోమవారం సాయంత్రం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజ్యాంగ విలువలను, ఎన్నికల సంఘం రూపొందించిన నియమాలను అతిక్రమించి పనిచేస్తున్నారని నాయకులు ఆరోపించారు.
ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజ్యాంగ విలువలను, ఎన్నికల సంఘం రూపొందించిన నియమాలను అతిక్రమించి పనిచేస్తున్నారని జనవిజ్ఞాన వేదిక జాతీయ నాయకులు డాక్టర్ మువ్వా రామారావు, ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు బీసం రామయ్య అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత 10 నెలల కాలంలో మిగతా ఇద్దరు కమిషనర్లు 14 సార్లు ఎన్నికల నియమాలకు విరుద్ధంగా జరిగిన నిర్ణయాలపై అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ, ఎన్నికల కమిషనర్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ చర్యల వల్ల భారతదేశంలో 13 కోట్ల ఓట్లు రద్దు అయ్యాయని, మహారాష్ట్ర, బెంగాల్ ఎన్నికలలో ప్రధాన ఎన్నికల కమిషనర్ పక్షపాత ధోరణి అవలంబించారని విమర్శించారు. బెంగాల్లో 16 లక్షల ఓట్లను తొలగించాలని ట్రిబ్యునల్ సూచించినప్పటికీ, బీజేపీకి అనుకూలమైన తీర్పు కోసం ఆ ఓట్లను ఓటర్ జాబితాలో చేర్చడం రాజ్యాంగ విరుద్ధమని, గోవాలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ 97 ఓట్లను సిఫార్సు చేసినప్పటికీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఆమోదించకపోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఎన్నికల సంఘం తీరును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలో భాగంగా మిర్యాలగూడలో ఉదయం 10 గంటలకు తెలంగాణ అమరవీరుల స్థూపం నుంచి ర్యాలీ ఉంటుందని నిరసన కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త డాక్టర్ జాడి రాజు, ఎంసీపీఐ పార్టీ నాయకులు వస్కుల మట్టయ్య, సీపీఎం పార్టీ నాయకులు డబ్బికార్ మల్లేష్, రవి నాయక్, వెంకటేశ్వర్లు, గౌతమ్ రెడ్డి, జన విజ్ఞాన వేదిక సుదర్శన్, కిరణ్మయి, ఖాదర్ తదితరులు పాల్గొన్నారు.












