ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన పరివర్తన ర్యాలీ దాడి కేసులో 10 మంది ఆదివాసులకు ఎన్ఐఏ కోర్టు విధించిన మరణశిక్షను వెంటనే రద్దు చేయాలని ఆదివాసి కాంగ్రెస్ పార్టీ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
వివరాల్లోకి న ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లా జిరంఘాటి వద్ద జరిగిన పరివర్తన ర్యాలీపై దాడిలో 29 మంది మృతి చెందారని ఆయన తెలిపారు. ఈ ఘటనలో 10 మంది ఆదివాసులను నిందితులుగా పేర్కొని, గత 13 ఏళ్లుగా వారిని జైల్లో నిర్బంధించారని ఆయన వివరించారు. ఎన్ఐఏ ఆధ్వర్యంలో జరిగిన కేసు విచారణ అనంతరం, 2016లో కోర్టు 10 మందికి మరణ శిక్ష విధించిందని ఆయన పేర్కొన్నారు. బస్తర్ ప్రాంతంలో 2005 నుంచి 2011 వరకు జరిగిన సాయుధ కార్యకలాపాల్లో వందలాది మంది ఆదివాసులు హత్యకు గురయ్యారని, మహిళలపై అత్యాచారాలు జరిగాయని ఆయన ఆరోపించారు. నందిని సుందర్, రామచంద్ర గుహ తదితరుల నేతృత్వంలో సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ ఆధారంగా, 2011లో సల్వాజూడుం కార్యకర్తలను చట్టవిరుద్ధంగా ప్రకటిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే, దాని ప్రభావం 2013 వరకు కొనసాగిందన్నారు.
సుక్మలో ముగిసిన కాంగ్రెస్ పార్టీ పరివర్తన ర్యాలీ నుంచి జగదల్ పూర్ వస్తున్న మహేంద్ర కర్మ కాన్వాయ్ పై జరిగిన దాడిలో మహేంద్ర కర్మతో పాటు 29 మంది మృతి చెందారని ఆయన తెలిపారు. గతంలో ప్రభుత్వాలు ఉద్యమానికి సంబంధించిన కేసులను ఎత్తివేస్తామని, జైళ్లలో ఉన్న రాజకీయ ఖైదీలను విడుదల చేస్తామని ప్రకటించాయని పేర్కొంటూ, ప్రస్తుతం కోర్టులో విచారణలో ఉన్న కేసులను కూడా నిలిపివేసి, నిందితులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మహోయిస్టు ఉద్యమం పేరుతో దేశవ్యాప్తంగా నమోదైన కేసులను ఎత్తివేయాలని, ఇప్పటికే శిక్షలు విధించిన వారి శిక్షలను రద్దు చేసి బేషరతుగా విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు.












