రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో, బీఎల్ఆర్ మేనిఫెస్టో బోగస్ అని బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు ఆరోపించారు. మేనిఫెస్టోలో పేర్కొన్న వాగ్దానాలు ప్రజలకు ఇచ్చిన దాఖలాలు లేవని, కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి పనులను కాంగ్రెస్ విస్మరించిందని ఆయన విమర్శించారు.
మంగళవారం స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మేనిఫెస్టోలో పేర్కొన్న ఆరు గ్యారంటీలు, 420 వాగ్దానాలు ప్రజలకు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. 4 ఫ్లైఓవర్లు అన్నారు.. ఒక్కటి కాలేదన్నారు, ఒక్క ప్రాజెక్టు కట్టలేదన్నారు. మేము ప్రారంభించిన పనులు తప్ప ఆయన ఒక్క కొత్త పని చేయలేదని ఆరోపించారు. వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేశారన్నారు.
కేసీఆర్ కు కృతజ్ఞతగా పాలాభిషేకం
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హయాంలో తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి, గిరిజనులకు ఆత్మగౌరవం, స్వయం పాలన కల్పించినందుకు కృతజ్ఞతగా ఈ నెల 17న తండాలు గ్రామ పంచాయతీలుగా మారిన గ్రామాల్లో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించనున్నట్లు భాస్కర్ రావు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని భాస్కర్ రావు ఆధ్వర్యంలో, మిర్యాలగూడలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ప్రకటించారు.
గిరిజనుల అభివృద్ధికి కేసీఆర్ కృషి
రాష్ట్రంలో గిరిజనుల చిరకాల ఆకాంక్షను గుర్తించి, తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని భాస్కర్ రావు పేర్కొన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో కేసీఆర్ హయాంలో మొత్తం 58 నూతన గ్రామ పంచాయతీలు మంజూరు కాగా, అందులో 40 తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా గ్రామ పంచాయతీ భవనాలు, బీటీ రోడ్లు, ఎస్టీ గ్రామాల్లో రోడ్ల నిర్మాణం, గిరిజన గురుకుల పాఠశాలల భవనాలు, సంత్ సేవాలాల్ భవనం వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు చేయించి, గిరిజనుల అభివృద్ధికి కృషి చేసినట్లు భాస్కర్ రావు తెలిపారు.












