రంగారెడ్డి, 16 September
షాద్ నగర్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున డేటా సెంటర్ల ఏర్పాటు, భూసేకరణ అంశాలు ప్రజల భవిష్యత్తును అంధకారం చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితులే ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారని ఆయన విమర్శించారు.
షాద్ నగర్ నియోజకవర్గంలో కనీవినీ ఎరుగని రీతిలో పెద్ద ఎత్తున డేటా సెంటర్ల ఏర్పాటు.. దానికి అనుగుణంగా వందలాది ఎకరాల సమీకరణ అంశాలు షాద్ నగర్ నియోజకవర్గ ప్రజల భవిష్యత్తును అంధకారం చేయబోతున్నాయని, దీనికి ఇక్కడే స్కెచ్ వేస్తున్నారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, స్థానిక నేత పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో మొత్తం 50 డేటా సెంటర్లకు రంగం సిద్ధం చేస్తున్నారని, స్థానిక బాలాజీ వెంచర్లో ఓ ఇంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన అతి దగ్గర వ్యక్తి ఇక్కడ తర్జనభర్జనలు పడుతున్నారని, భూసేకరణ తదితర అంశాలను పరిశీలిస్తున్నారని పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు.
బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మించి, దానిద్వారా ఈ డేటా సెంటర్లకు నీరు అందించే ప్రక్రియ కొనసాగుతుందన్న అనుమానాలను ఆయన బలపరిచారు. లక్ష్మీదేవిపల్లి డీపీఆర్ బయటపడితే మొత్తం కథ ప్రజలకు అర్థమవుతుందని అన్నారు. ప్రతిపక్షాల అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందన్నారు.
షాద్ నగర్ నియోజకవర్గంలో ఇప్పటికే మూడు డేటా సెంటర్లు నిర్మాణం జరుగుతున్నాయని, మరో డేటా సెంటర్ కు అనుమతి సిద్ధంగా ఉందని, నియోజకవర్గంలో ఇలా మొత్తం 50 డేటా సెంటర్లు ఏర్పాటు చేసేందుకు కుట్ర నడుస్తుందని అన్నారు. ఇది ఎమ్మెల్యే స్థాయి చేజారిపోయిందని, సీఎం లెవెల్లో ఇక్కడ డేటా సెంటర్ల ఏర్పాటుకు పక్కా ప్లాన్ జరుగుతుందన్నారు.
బాలాజీ వెంచర్ లో ఓ ఇంట్లో సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన అతి సమీప వ్యక్తి ఇక్కడే రాకపోకలు కొనసాగిస్తూ, భూముల కూర్పు, డేటా సెంటర్ల ఏర్పాటుకు అవసరమైన అనుమతులు తదితర అంశాలను పరిశీలిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఆ వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డికి అతి సన్నిహితంగా ఉండే వ్యక్తి అని తెలిపారు.
లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ తాగునీటి కోసమా, సాగునీటి కోసమా లేక డేటా సెంటర్ల నిర్వహణ కోసమా తెలియజేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎంతైనా ఉందన్నారు. మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పిన ప్రభుత్వ పెద్దలు, ఇప్పుడు రిజర్వాయర్ పరిమాణం ఎంత, ఎంత టీఎంసీ నీటిని ఇక్కడ నిలువ చేయబోతుంది, ఇందులో తాగు, సాగునీటి వాటా ఎంత, డీపీఆర్ బయట పెట్టాలని పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వం లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణంపై బోగస్ మాటలు మాట్లాడుతుందని అన్నారు.
చటాన్ పల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి ఆర్థిక వనరులు సమకూర్చలేక ప్రభుత్వం చేతులెత్తేసిందని పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సుమారు 90 కోట్ల రూపాయలు నిర్మాణానికి మంజూరు చేశామని చెప్పారని, ఆ తరువాత ఆ పనులు, విధివిధానాలు నచ్చక స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ద్వారా మరో 190 కోట్లు అదనంగా కేటాయించబోతున్నట్లు ప్రకటించారని, పనులు నెల రోజుల్లో ప్రారంభిస్తామని 2024లో చెప్పారని, ప్రభుత్వం వచ్చి రెండు నెలలు దాటుతున్నా హామీ ఎక్కడ అమలు కాలేదని ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ అంశంపై పాలమూరు ఎంపీ డీకే అరుణ, చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ మురళి కృష్ణతో మాట్లాడారని, దీనికి కావలసిన నిధులు కేంద్ర ప్రభుత్వం సమకూర్చుతోందని, రాష్ట్ర ప్రభుత్వ వాటా విషయంలో కూడా పూర్తి స్పష్టత తీసుకొని వంతెన పనులు ప్రారంభించే విధంగా త్వరలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చొరవతో దాదాపు 89 కోట్ల రూపాయలకు పైగా భూసేకరణ కోసం కేటాయించడం జరిగిందని, అదేవిధంగా 200 కోట్లకు పైగా వంతెన నిర్మాణానికి కేటాయించి, పూర్తిస్థాయిలో సమీక్ష సమావేశం జరపడానికి ముందుకు వస్తున్నారని పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు.











