అధిక లాభాల ఆశ చూపిస్తూ ఓ మొబైల్ యాప్ దేశవ్యాప్తంగా లక్షలాది మందిని మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. గుజరాత్‌కు చెందిన ఎస్డీ పే ( ) డిజిటల్ వాలెట్ యాప్ ద్వారా సుమారు రూ.1,200 కోట్లకు పైగా ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. రోజువారీ వడ్డీ, క్యాష్‌బ్యాక్, ఇతరులను యాప్‌లో చేరిస్తే భారీ కమీషన్లు ఇస్తామంటూ నిర్వాహకులు పెట్టుబడిదారులను ఆకర్షించినట్లు అధికారులు గుర్తించారు.
ధవల్ పటేల్ అనే వ్యక్తి 2024లో ఈ యాప్‌ను ప్రారంభించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. తొలుత మొబైల్ రీఛార్జీలు, బిల్లుల చెల్లింపుల కోసం డిజిటల్ వాలెట్‌గా ప్రచారం చేసిన ఈ యాప్, అనంతరం పెట్టుబడులపై రోజుకు 0.15 శాతం నుంచి 0.30 శాతం వరకు వడ్డీ ఇస్తామని ప్రకటించింది. ఈ ఆఫర్లతో పెద్ద సంఖ్యలో ప్రజలు పెట్టుబడులు పెట్టారు.
యాప్‌లో కొత్తగా చేరిన వారిని మరింత మందిని చేర్చేలా ప్రోత్సహించేందుకు రెఫరల్ క్యాష్‌బ్యాక్ పథకాన్ని ప్రవేశపెట్టారు. మొదటి స్థాయిలో కొత్త సభ్యులను చేర్చిన వారికి 30 శాతం వరకు, 10 నుంచి 15వ స్థాయిలో ఉన్నవారికి 3 శాతం వరకు కమీషన్ ఇస్తామని ఆశ చూపించారు. సెమినార్లు, ఆన్లైన్ సమావేశాలు, ప్రచార కార్యక్రమాల ద్వారా ఈ పథకాన్ని విస్తరించినట్లు పోలీసులు గుర్తించారు.
రూ.9.5 లక్షలు పెట్టుబడి పెట్టిన ఉపాధ్యాయురాలు
వడోదరకు చెందిన 48 ఏళ్ల ఉపాధ్యాయురాలు తన ఫ్లాట్ విక్రయించగా వచ్చిన రూ.9.5 లక్షలను 2025లో ఈ యాప్‌లో పెట్టుబడిగా పెట్టారు. 2026 మధ్య నాటికి ఆమె ఖాతాలో సుమారు రూ.50 లక్షలు ఉన్నట్లు చూపించినప్పటికీ, ఆ మొత్తాన్ని ఉపసంహరించుకునే అవకాశం లేకుండా పోయింది. ఆమె ద్వారా బంధువులు, సహోద్యోగులు కూడా ఈ పథకంలో చేరారు. 11 మంది కుటుంబ సభ్యులు కలిపి రూ.30 లక్షలు, 20 మంది సహోద్యోగులు మరో రూ.12 లక్షలు పెట్టుబడి పెట్టారు. ఆమె పరిచయాల ద్వారా మొత్తం 800 మంది వరకు ఈ నెట్‌వర్క్‌లో చేరినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
మరో వ్యక్తి ఇంటి నిర్మాణం కోసం ఈ పథకంలో పెట్టుబడి పెట్టాలని భావించి, తన పేరుతో రూ.20 లక్షలు, భార్య పేరుతో మరో రూ.20 లక్షలు వ్యక్తిగత రుణాలు తీసుకున్నారు. అదనంగా రూ.20 లక్షల బంగారు రుణం తీసుకుని యాప్‌లో పెట్టుబడి పెట్టినట్లు పోలీసులు గుర్తించారు.
కొత్త పెట్టుబడులతో పాతవారికి చెల్లింపులు
ఈ పథకం ద్వారా ఎలాంటి గణనీయమైన ఉత్పత్తులు లేదా సేవల ద్వారా ఆదాయం సమకూరలేదని పోలీసులు అనుమానిస్తున్నారు. కొత్తగా పెట్టుబడులు పెట్టిన వారి డబ్బుతో గతంలో చేరిన వారికి వడ్డీ, కమీషన్లు చెల్లించినట్లు దర్యాప్తులో గుర్తించారు. ఇది బహుస్థాయి మార్కెటింగ్ విధానంలో సాగిన మోసంగా పోలీసులు భావిస్తున్నారు. పెట్టుబడిదారులకు వాగ్దానం చేసిన వడ్డీ చెల్లింపులు నిలిచిపోవడంతో అనుమానాలు మొదలయ్యాయి. డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగిన వారికి కంపెనీ షేర్లు ఇస్తామని, త్వరలో ఐపీఓ తీసుకొస్తామని నిర్వాహకులు చెప్పినట్లు బాధితులు ఆరోపించారు.
15 లక్షల మందికి పైగా యాప్ వినియోగం
పోలీసుల దర్యాప్తులో ఈ యాప్‌ను 15 లక్షల మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్నట్లు వెల్లడైంది. మొత్తం 6,52,831 బ్యాంకు ఖాతాల ద్వారా సుమారు రూ.1,211 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. అయితే, నగదు రూపంలో ఏజెంట్లు సేకరించిన పెట్టుబడులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా లభించాల్సి ఉంది. నాటికి 876 మంది బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వీరు మొత్తం రూ.37.42 కోట్ల మేర నష్టపోయినట్లు ఫిర్యాదులు అందాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పనిచేసిన సుమారు 95 మంది కీలక ఏజెంట్లను పోలీసులు గుర్తించారు.






