తెలంగాణలో పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆధార్ బయోమెట్రిక్ వివరాల నవీకరణపై పాఠశాల విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. పెండింగ్లో ఉన్న తప్పనిసరి బయోమెట్రిక్ నవీకరణను పూర్తి చేయడానికి ఒక గడువును నిర్ణయించింది. ఈ ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలని విద్యాసంస్థలను ఆదేశించింది.
విద్యాశాఖ ఆధ్వర్యంలో పాఠశాలలు, కళాశాలల్లో ఆధార్ నమోదు, నవీకరణ కోసం ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నారు. శాఖ తరఫున నియమించిన ఆధార్ ఆపరేటర్లు ఆయా విద్యాసంస్థలకు వెళ్లి విద్యార్థుల వివరాలను అప్డేట్ చేస్తున్నారు. ఈ శిబిరాలకు పాఠశాలలు, జూనియర్ కళాశాలలు తప్పనిసరిగా సహకరించాలని అధికారులు సూచించారు.
5, 15 ఏళ్ల వయస్సులో తప్పనిసరి నవీకరణ
ఆధార్ నిబంధనల ప్రకారం పిల్లలకు 5 సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు, అలాగే 15 సంవత్సరాల వయస్సు దాటిన తర్వాత బయోమెట్రిక్ వివరాలను నవీకరించాలి. ఇందులో వేలిముద్రలు, కంటి ఐరిస్ వివరాలు, తాజా ఫొటోను నమోదు చేస్తారు. చిన్న వయస్సులో నమోదైన బయోమెట్రిక్ వివరాలు పిల్లలు పెరుగుతున్న కొద్దీ మారే అవకాశం ఉండటంతో ఈ నవీకరణను చేపడుతున్నారు.
పాఠశాలల బాధ్యతలు
హెడ్మాస్టర్లు, ప్రిన్సిపాళ్లు, విద్యాసంస్థల యాజమాన్యాలు యూడైస్ ప్లస్ () పోర్టల్లోకి వెళ్లి తమ సంస్థలో ఏ విద్యార్థుల బయోమెట్రిక్ నవీకరణ పెండింగ్లో ఉందో పరిశీలించాలని విద్యాశాఖ సూచించింది. పెండింగ్లో ఉన్న విద్యార్థుల వివరాలను గుర్తించి, గడువులోగా ప్రక్రియ పూర్తి చేయించే బాధ్యతను తీసుకోవాలని ఆదేశించింది.
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
కొన్ని ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు తమ ప్రాంగణాల్లో ఆధార్ క్యాంపులు నిర్వహించేందుకు ఆపరేటర్లను అనుమతించడం లేదని విద్యాశాఖ దృష్టికి వచ్చింది. ఇలాంటి సంస్థలపై తీవ్రంగా వ్యవహరిస్తామని అధికారులు హెచ్చరించారు. ఆధార్ ఆపరేటర్లను క్యాంపుల నిర్వహణకు అనుమతించకుండా నిబంధనలను ఉల్లంఘించే విద్యాసంస్థలపై సంబంధిత నిబంధనల ప్రకారం శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని స్పష్టం చేశారు.
ఆధార్ బయోమెట్రిక్ వివరాలు సరిగ్గా నవీకరించి ఉండటం వల్ల భవిష్యత్తులో ఆధార్ ఆధారిత గుర్తింపు ప్రక్రియ సులభంగా పూర్తవుతుంది. విద్యా సేవలు, ప్రభుత్వ పథకాలు, ఉపకార వేతనాలు, అలాగే జేఈఈ, నీట్ వంటి పోటీ పరీక్షల సమయంలో ఆధార్ ఆధారిత ధ్రువీకరణ అవసరమైన సందర్భాల్లో ఇబ్బందులు తగ్గుతాయని అధికారులు చెబుతున్నారు.
5 నుంచి 17 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలకు తప్పనిసరి బయోమెట్రిక్ నవీకరణ వరకు ఉచితంగా అందుబాటులో ఉంది. దీంతో తల్లిదండ్రులు, విద్యార్థులు గడువు ముగిసేలోపు ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.












