ఫ్రాన్స్‌లో శనివారం ( ) జరగనున్న నిరసన కార్యక్రమాల నేపథ్యంలో ప్రభుత్వం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. దేశవ్యాప్తంగా సుమారు 70 వేల మంది పోలీసు, భద్రతా సిబ్బందిని మోహరించాలని నిర్ణయించింది. గత వారాంతంలో చోటుచేసుకున్న హింస, దోపిడీ, దాడుల నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టింది.
ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల మంత్రి లారెంట్ న్యూనెజ్ శుక్రవారం ఈ వివరాలను వెల్లడించారు. గత వారాంతంలో నిరసనల సందర్భంగా చోటుచేసుకున్న హింస, దుకాణాల దోపిడీ, ప్రభుత్వ భవనాలపై దాడులు మళ్లీ పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
నిరసనలకు కారణాలు
ఫ్రాన్స్‌లో మొదట పాఠశాలల్లో సిబ్బంది కొరత, విద్యా సదుపాయాల లోపాలపై విద్యార్థులు నిరసనలు ప్రారంభించారు. అనంతరం జీవన వ్యయాలు పెరగడం, వేతనాలు, పెన్షన్లు, విద్యకు నిధుల కేటాయింపు వంటి అంశాలపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి కూడా ఉద్యమానికి తోడైంది. దీంతో నిరసనలు దేశవ్యాప్తంగా విస్తరించాయి.
గత న జరిగిన ప్రదర్శనల సందర్భంగా పలు నగరాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. దుకాణాలు ధ్వంసం కావడం, వస్తువుల దోపిడీ, వాహనాలు దగ్ధం కావడం వంటి ఘటనలు నమోదయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో భద్రతా బలగాల ముందస్తు ఏర్పాట్లపై ప్రభుత్వానికి విమర్శలు ఎదురయ్యాయి.
ప్రభుత్వ హెచ్చరిక
సామాజిక మాధ్యమాల్లో కొన్ని వర్గాల నుంచి దోపిడీ, హింసకు పిలుపులు వచ్చినట్లు గుర్తించామని మంత్రి న్యూనెజ్ తెలిపారు. ప్రభుత్వ భవనాలను లక్ష్యంగా చేసుకునే ప్రయత్నాలు జరగవచ్చన్న సమాచారంతో అప్రమత్తమైనట్లు చెప్పారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను సహించబోమని హెచ్చరించారు.
భద్రతా సిబ్బందికి అదనంగా ప్రత్యేక బలగాలు, సాయుధ పోలీసు విభాగాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు, నీటి ఫిరంగులు వంటి పరికరాలను సిద్ధం చేసినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడించాయి. గత నిరసనల్లో జరిగిన నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాపారులు కూడా తమ దుకాణాల అద్దాలకు రక్షణ పలకలు ఏర్పాటు చేసుకుంటున్నారు.
పలు నగరాల్లో ఆంక్షలు
రాజధాని పారిస్‌లో నిరసన ప్రదర్శనలకు పరిమిత మార్గంలోనే అనుమతి ఇచ్చారు. లియోన్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో నిరసనకారుల ప్రవేశంపై ఆంక్షలు విధించారు. మార్సెయ్ నగరంలో మొదట నిరసనలను నిషేధించిన అధికారులు, అనంతరం కార్మిక సంఘం నిర్వహించే ఒక ప్రదర్శనకు మినహాయింపుతో అనుమతి ఇచ్చారు.
కొన్ని నగరాల్లో విధించిన ఆంక్షలపై పౌరహక్కుల సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కాపాడుతూనే, హింసాత్మక ఘటనలను అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మానవ హక్కుల సంస్థలు పేర్కొన్నాయి.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ శుక్రవారం విద్యార్థి ప్రతినిధులతో సమావేశమయ్యారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం, ఉపాధ్యాయుల నియామకం, విశ్వవిద్యాలయ ప్రవేశ విధానాల్లో మార్పులు వంటి అంశాలను విద్యార్థులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అయితే, తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పష్టమైన ప్రతిపాదనలు ప్రకటించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని విద్యార్థి ప్రతినిధులు తెలిపారు.

