Delhi, 15 September
ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ ఇటీవల ముగిసిన అంతర్జాతీయ పర్యటనలో భాగంగా లండన్ లోని కార్యక్రమాలు గోప్యత, రాజకీయ విమర్శలు, నిరసనల మధ్య ముగిశాయి. దక్షిణాసియా ప్రవాస సమూహాల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురుకావడంతో ఆయన పర్యటన చివరి దశలో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ పరిణామాలు ఆర్ఎస్ఎస్ ప్రతిష్టకు గట్టి దెబ్బతీశాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
దక్షిణాసియా ప్రవాస సమూహాల నుంచి వ్యతిరేకత తీవ్రం కావడంతో ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ లండన్ కార్యక్రమాన్ని గోప్యంగా నిర్వహించాల్సి వచ్చింది. ఆయన పాల్గొన్న చివరి కార్యక్రమం వేదిక వెలుపల కూడా నిరసనలు చోటుచేసుకున్నాయి.
ఇటీవల ముగిసిన మోహన్ భగవత్ అంతర్జాతీయ పర్యటనను ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా విస్తృతంగా ప్రచారం చేశారు. భారత్, హిందూ సమాజం, ఆర్ఎస్ఎస్ పై సానుకూలమైన, వాస్తవాధారిత దృక్పథాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటడం, ఆ సంస్థపై నెలకొన్న అపోహలను తొలగించడం ఈ ప్రచార లక్ష్యమని ఆర్ఎస్ఎస్ పేర్కొంది.
అయితే, ఈ పర్యటన చివరి మజిలీ అయిన లండన్ పర్యటన మాత్రం గోప్యత, రాజకీయ విమర్శలు, కార్యక్రమానికి అంతరాయం వంటి పరిణామాల మధ్య ముగిసింది. ఈ పరిణామం ఆర్ఎస్ఎస్ కు మిత్రుల కంటే విమర్శకులను, వ్యతిరేకులను ఐక్యం చేసే పరిస్థితిని తెచ్చిపెట్టిందని హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్ యూకే ( ) సభ్యుడు రాజీవ్ సిన్హా వ్యాఖ్యానించారు.
భగవత్ అమెరికా, కెనడా నుంచి బ్రిటన్ వరకు వెంటాడిన ప్రగతిశీల దక్షిణాసియా, హిందూ సంస్థల తీవ్ర ప్రతిఘటన ఆర్ఎస్ఎస్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో జాగ్రత్తగా నిర్మించుకున్న ప్రతిష్టను దెబ్బతీసింది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి సిద్ధాంతపరమైన మూల సంస్థగా పరిగణించబడుతున్న ఈ అర్ధసైనిక సంస్థ, హిందుత్వ జాతీయవాదాన్ని అమలినమైనదని, సమ్మిళితమైనదని చూపించే ప్రయత్నాలకు ఒక పరిమితి ఉందనే విషయాన్ని ఈ పరిణామాలు బహిర్గతం చేశాయి.
ప్రపంచమంతా ఒకే కుటుంబం, ఐక్యత వంటి నినాదాలను ముందుకు తెచ్చి భారతీయ ప్రవాస సమాజాన్ని ఆకట్టుకునే ప్రయత్నాల మాటున ఉన్న తీవ్ర మితవాద రాజకీయాలను కప్పిపుచ్చుతూ హిందుత్వ జాతీయవాదానికి అంతర్జాతీయంగా ఆమోదయోగ్యమైన రూపాన్ని కల్పించాలన్న ఆర్ఎస్ఎస్ ప్రయత్నాలకు ఇప్పుడు ఎదురుదెబ్బ తగులుతోందని ఈ ప్రతిఘటన స్పష్టం చేసింది.
సిన్హా ఎక్స్ లో పంచుకున్న వీడియోలో బెంట్లీ హోటల్ ప్రవేశద్వారం వద్ద పోలీసులు భారీగా మోహరించి ఉండటం కనిపించింది. హోటల్ గేటు వద్దకు చేరుకున్న నిరసనకారులు గట్టిగా నినాదాలు చేస్తూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మోహన్ భగవత్, నేను హిందువునునువ్వు ఫాసిస్టువి నిజమైన హిందువులు మూకదాడులకు పాల్పడరు అంటూ వారు నినదించారు.
మరో వీడియోలో సిన్హా ఆందోళనకారులను ఉద్దేశించి మాకు న్యాయం దక్కకపోతే మీకు శాంతి ఉండదు అంటూ నినదించడం వినిపించింది. భగవత్ కార్యక్రమం జరిగిన హోటల్ వెలుపల చోటుచేసుకున్న ఈ నిరసన ఆయన పర్యటనకు ఎదురైన తీవ్ర వ్యతిరేకతను స్పష్టంగా చాటిచెప్పింది.
ఈ నిరసన కార్యాచరణ మొదట ఒక చిన్నస్థాయి పికెటింగ్ గా ప్రారంభమైందని సిన్హా తెలిపారు. ఇతర నిరసనకారులతో కలిసి తానే దీనికి ప్రాథమికంగా ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. సుమారు రెండు గంటలపాటు సాగిన ఈ నిరసన భగవత్ ను కలవరపాటుకు గురిచేసిందని, కార్యక్రమ నిర్వాహకులను తీవ్ర అవమానానికి గురిచేసిందని సిన్హా అన్నారు. నిరసన తీవ్రతతో కార్యక్రమాన్ని నిర్ణయించిన సమయానికి ముందే ముగించాల్సి వచ్చిందని, హాజరైన కొందరిని పోలీసులు సాయంతో బయటకు తీసుకెళ్లారని తెలిపారు. బయటకు వెళ్లే సమయంలో వారిలో కొందరు తమ ముఖాలను కప్పుకున్నారని ఆయన చెప్పారు.












