పిల్లలకు అర్ధరాత్రి అధిక జ్వరం, శ్వాస ఇబ్బందులు, ఫిట్స్ వంటి అత్యవసర పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఆందోళన చెందకుండా సరైన వైద్య సహాయం అందించేందుకు మణిపాల్ ఆస్పత్రులు మణిపాల్ కిడ్స్ ఫస్ట్ రెస్పాండర్ సర్వీస్ పేరుతో 24 గంటల అత్యవసర వైద్య సేవలను ప్రారంభించాయి. ఈ సేవ ద్వారా తల్లిదండ్రులు, పాఠశాలలు, పిల్లల సంరక్షణ కేంద్రాలు నేరుగా నిపుణులను సంప్రదించవచ్చు.
పిల్లలకు అర్ధరాత్రి అధిక జ్వరం వచ్చినా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైనా, అకస్మాత్తుగా ఫిట్స్ వచ్చినా తల్లిదండ్రులు వెంటనే ఏం చేయాలో తెలియక ఆందోళన చెందుతుంటారు. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో సరైన వైద్య సహాయం ఆలస్యం కాకుండా మణిపాల్ ఆస్పత్రులు కొత్త సేవను ప్రారంభించాయి. మణిపాల్ కిడ్స్ ఫస్ట్ రెస్పాండర్ సర్వీస్ పేరుతో 24 గంటలూ పిల్లల అత్యవసర వైద్య సహాయం అందించే కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఈ సేవ ద్వారా తల్లిదండ్రులు, పాఠశాలలు, పిల్లల సంరక్షణ కేంద్రాలు చిన్నారుల ఆరోగ్య సమస్యలపై నేరుగా పిల్లల అత్యవసర వైద్య నిపుణులను సంప్రదించవచ్చు. ఈ సేవ కోసం ప్రత్యేకంగా 080 2222 1111 హెల్ప్‌లైన్ నంబర్‌ను ఏర్పాటు చేశారు. తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఈ నంబర్‌కు ఫోన్ చేసినప్పుడు ముందుగా కమాండ్ సెంటర్లోని శిక్షణ పొందిన సిబ్బంది పిల్లల ఆరోగ్య పరిస్థితి గురించి కొన్ని వివరాలు తెలుసుకుంటారు. అనంతరం పిల్లల అత్యవసర వైద్యులు లేదా ఇంటెన్సివ్ కేర్ నిపుణులతో వీడియో కాల్ ద్వారా మాట్లాడే అవకాశం కల్పిస్తారు. సాధారణంగా ఫోన్ చేసిన రెండు నుంచి మూడు నిమిషాల్లోనే వైద్య నిపుణులతో అనుసంధానం చేసేలా వ్యవస్థను రూపొందించారు. వీడియో ద్వారా చిన్నారి పరిస్థితిని పరిశీలించి, వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలా, అంబులెన్స్ అవసరమా లేదా ఇంటి వద్దనే ప్రాథమిక సంరక్షణ అందిస్తే సరిపోతుందా అనే విషయంపై వైద్యులు సూచనలు ఇస్తారు.
ఈ సేవలో భాగంగా పిల్లల ఆరోగ్య పరిస్థితిని బట్టి మూడు రకాలుగా స్పందిస్తారు. చిన్నారి పరిస్థితి తీవ్రంగా ఉంటే ఆలస్యం చేయకుండా సమీపంలోని తగిన అత్యవసర వైద్య కేంద్రానికి తీసుకెళ్లాలని సూచిస్తారు. ఆస్పత్రికి తరలించాల్సిన అవసరం ఉంటే మణిపాల్ అంబులెన్స్ రెస్పాన్స్ సర్వీసెస్ (ఎంఏఆర్ఎస్) ద్వారా అంబులెన్స్‌ను పంపిస్తారు. అత్యవసరం కాని సమస్యలకు వైద్యులు అవసరమైన సూచనలు, తదుపరి జాగ్రత్తలు తెలియజేస్తారు. ఈ విధానం ద్వారా ప్రతి చిన్న ఆరోగ్య సమస్యకూ ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం లేకుండా, నిజంగా అత్యవసరమైన పరిస్థితులను త్వరగా గుర్తించవచ్చని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఇంట్లోనే కాకుండా పాఠశాలలు, డేకేర్ కేంద్రాల్లోనూ పిల్లలకు అనారోగ్యం లేదా గాయాలు ఎదురైనప్పుడు ఈ సేవను వినియోగించుకోవచ్చు. ఉపాధ్యాయులు, సంరక్షకులు వైద్య నిపుణులను సంప్రదించి తక్షణ సూచనలు పొందవచ్చు. చిన్నారులకు పెద్దలతో పోలిస్తే వైద్య అత్యవసర పరిస్థితులు భిన్నంగా ఉంటాయని, వారి వయసు, శారీరక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని చికిత్స నిర్ణయించాలని వైద్యులు పేర్కొన్నారు.
మణిపాల్ ఆస్పత్రుల ఛైర్మన్ డాక్టర్ హెచ్. సుదర్శన్ బల్లాల్ మాట్లాడుతూ.. పిల్లలకు రాత్రి వేళల్లో అనారోగ్యం తలెత్తినప్పుడు ఎవరిని సంప్రదించాలో తెలియక తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతుంటారని తెలిపారు. వీడియో సంప్రదింపుల ద్వారా నిపుణుల సలహా అందించడం, అవసరమైతే అంబులెన్స్ సేవలను అనుసంధానం చేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని వివరించారు. పిల్లలకు అత్యవసర పరిస్థితి ఎదురైనప్పుడు మొదటి గంటలోనే సరైన చికిత్స అందడం కీలకమని వైద్యులు చెబుతున్నారు. లక్షణాలను గుర్తించడంలో ఆలస్యం కావడం వల్ల ఆస్పత్రికి చేరుకునే సమయానికి పరిస్థితి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. అందుకే కుటుంబాలకు తక్షణ వైద్య మార్గదర్శకత్వం అందించడంతో పాటు, అవసరమైనప్పుడు అంబులెన్స్, ఆస్పత్రి సేవలను సమన్వయం చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సేవకు సంబంధించిన సమాచారం కోసం లేదా అత్యవసర వైద్య సలహా పొందేందుకు 080 2222 1111 నంబర్‌ను సంప్రదించవచ్చు.












