హైదరాబాద్‌లోని నిమ్స్ అదనపు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నోరి లక్ష్మీ భాస్కర్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోదాలు నిర్వహించారు. ఆయన నివాసంతో పాటు బంధువులు, సన్నిహితుల ఇళ్లలో జరిగిన ఈ దాడుల్లో పలు కీలక ఆస్తులను గుర్తించారు.
ఏసీబీ అధికారులు సేకరించిన వివరాల ప్రకారం, డాక్టర్ నోరి లక్ష్మీ భాస్కర్‌కు కూకట్‌పల్లిలోని ఓ హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీలో నాలుగు పడక గదుల ఫ్లాట్, మరో రెండు మూడు పడక గదుల ఫ్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. మణికొండ, పేట్‌బషీరాబాద్, కూకట్పల్లి ప్రాంతాల్లో మరో ఐదు రెండు పడక గదుల ఫ్లాట్లు కూడా ఆయన పేరు మీద ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఇవే కాకుండా, యాదాద్రి, నందిగామ, శామీర్‌పేటలో స్థలాలు, విశాఖపట్నంలో 800 గజాల స్థలం కూడా ఆయనకు ఉన్నట్లు వెల్లడించారు. ఈ సోదాల్లో భాగంగా జాగ్వార్, ఆడి, టాటా నెక్సాన్ కార్లతో పాటు రాయల్ ఎన్ఫీల్డ్, వెస్పా, యాక్టివా, యమహా వంటి ద్విచక్ర వాహనాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
అధికారులు ఇంట్లో తనిఖీలు నిర్వహించగా, సుమారు 517.8 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.5 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు లభించినట్లు ఏసీబీ వెల్లడించింది. ఆర్థిక లావాదేవీలను పరిశీలించగా, బ్యాంకు ఖాతాల్లో సుమారు రూ.41 లక్షలు, పోస్టాఫీసులో రూ.12 లక్షలు, ప్రైవేట్ ఆర్థిక సంస్థల్లో రూ.35 లక్షలు, మ్యూచువల్ ఫండ్లలో రూ.29.55 లక్షల పెట్టుబడులు ఉన్నట్లు గుర్తించారు.
వివిధ వ్యక్తులకు సుమారు రూ.1.33 కోట్లను అప్పుగా ఇచ్చినట్లు కూడా ఏసీబీ పేర్కొంది. ఒక ఫ్లాట్ కొనుగోలు కోసం రూ.1.30 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు, ఆ ఆస్తి ప్రస్తుతం డెట్ రికవరీ ట్రిబ్యునల్ పరిధిలో వివాదంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు గుర్తించిన ఆస్తుల పత్రాల విలువ సుమారు రూ.6.13 కోట్లుగా ఉన్నట్లు ఏసీబీ వెల్లడించింది.
ఈ కేసును అవినీతి నిరోధక చట్టంలోని సంబంధిత నిబంధనల కింద నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు అధికారిపై వచ్చిన ఆరోపణలు నిర్ధారణ కాలేదనే విషయాన్ని గమనించాలని అధికారులు సూచించారు.

