హైదరాబాద్, 2 October
భారత స్వాతంత్య్ర సంగ్రామంలో మహాత్మా గాంధీ ఒక గొప్ప ప్రజా నాయకుడిగా, ప్రజాస్వామిక వాదిగా, లౌకికవాదిగా నిలిచారు. ఆయన ఆచరణాత్మక పిలుపులతో జాతీయోద్యమంలోకి ప్రజలను తరలించారు. అయితే, నేటి దేశ పాలకులు గాంధీ ఆశయాలను తమ సంకుచిత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని, ఆయన కృషిని, ఆలోచనలను గందరగోళానికి గురిచేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గాంధీజీ ప్రతిపాదించిన ప్రజాస్వామ్యం, లౌకిక వాదం, సామాజిక న్యాయం వంటివి నేడు తీవ్ర దాడికి గురవుతున్నాయని ఈ నేపథ్యంలో ఆయన జయంతి రోజున ఆయన దృక్పథాన్ని స్మరించుకోవడం ఎంతో సందర్భోచితం.
భారత స్వాతంత్య్ర సంగ్రామంలో మహాత్మా గాంధీ ఒక గొప్ప ప్రజా నాయకుడు. ఆచరణాత్మక పిలుపుల ద్వారా జాతీయోద్యమంలోకి అసంఖ్యాక ప్రజానీకాన్ని ఆయన కదిలించగలిగారు. ప్రజాస్వామిక వాదిగా, గొప్ప లౌకికవాదిగా జీవితాన్ని కొనసాగించి మహాత్మాగా ప్రజలచేత కీర్తినందుకున్నారు. ఆయన తొలి రోజుల్లో హిందూ స్వరాజ్ గ్రంథంలో చెప్పిన విషయాలకు, స్వాతంత్రోద్యమ ఉధృతి రోజుల్లో హరిజన్ పత్రికలో రాసిన వ్యాసాలకు చాలా వైరుధ్యాలు కనబడతాయి. వీటిని వ్యక్తిలో చూడడం కంటే, జాతీయోద్యమంలో ప్రజల ఆకాంక్షలకు, దానికి నాయకత్వం వహిస్తున్న భూస్వామ్య వ్యవస్థతో ముడిపడిన బూర్జువా ప్రయోజనాలకు మధ్యన ఏర్పడిన కీలక వైరుధ్యాల నుండే చూడాలి.
నేటి దేశ పాలకులు గాంధీలోని తొలినాటి భావాలను తమ సంకుచిత ప్రయోజనాల కోసం అసందర్భంగా ఊటంకిస్తూ ఆయన కృషిని, ఆలోచనలను గందరగోళానికి గురిచేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. గాంధీజీ ప్రతిపాదించిన సామ్రాజ్యవాద వ్యతిరేకత, ప్రజాస్వామ్యం, లౌకిక వాదం, సామాజిక న్యాయంతో పాటు, భారత రాజ్యాంగం, తాజాగా ఎన్నికల వ్యవస్థ కేంద్ర పాలకుల వల్ల తీవ్ర దాడికి గురవుతున్నాయని ఈ నేపథ్యంలో గాంధీ అనుసరించిన ప్రజాస్వామిక, లౌకికవాద దృక్పధాన్ని ఆయన జయంతి రోజున స్మరించుకోవడం సందర్భోచితం.
గాంధీతో పనిచేసిన దాదాపు ప్రతి ప్రముఖ నాయకుడితో ఏదో ఒక దశలో ఆయనకు తీవ్రమైన విభేదాలు వచ్చాయి. ఆధునికత, జాతీయవాదం వంటి అంశాల్లో రవీంద్రనాథ్ టాగూర్‌తో; పారిశ్రామికీకరణ, సామ్యవాదం, ఆధునిక విజ్ఞానంపై జవహర్లాల్ నెహ్రూతో; స్వాతంత్య్ర సాధన పద్ధతులు, కాంగ్రెస్ నాయకత్వంపై సుభాష్ చంద్రబోస్‌తో; కుల వ్యవస్థ, దళితుల రాజకీయ హక్కులపై డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌తో గాంధీకి తీవ్రమైన విభేదాలు నడిచాయి. అయినప్పటికీ అవి వ్యక్తిగత శత్రుత్వాలుగా మారకుండా, దేశ భవిష్యత్తు కోసం సాగే చర్చలుగా గాంధీ వాటిని కొనసాగించారు. తమను అంగీకరించని వారందరినీ దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్న నేటి పాలకులకు ఇది గిట్టదు.
రవీంద్రనాథ్ టాగూర్, గాంధీల గురించి జవహర్లాల్ నెహ్రూ తన డిస్కవరీ ఆఫ్ ఇండియాలో వారిద్దరూ నిస్సందేహంగా 20వ శతాబ్దంలో ఇండియాలో జీవించిన గొప్ప వ్యక్తులు, వారు వ్యక్తం చేసిన భిన్నాభిప్రాయాలు మనకు ఆదేశప్రాయమైనవి అని పేర్కొన్నాడు. వారిద్దరూ గొప్ప దేశభక్తులు. అయితే వారి ఆలోచనా ప్రపంచాలు భిన్నమైనవి. టాగూర్‌కు మానవతావాదం, విశ్వమానవ దృక్పథం అత్యంత ముఖ్యమైనవి. సహాయ నిరాకరణకు, ప్రజల రాజకీయ చైతన్యానికి, స్వదేశీకి గాంధీ ప్రాధాన్యం ఇచ్చారు. 1920-21 ప్రాంతంలో గాంధీజీ ప్రారంభించిన సహాయ నిరాకరణ ఉద్యమం, విదేశీ వస్తువుల బహిష్కరణ వంటి కార్యక్రమాలపై టాగూర్ తన వ్యతిరేకతను ప్రకటించాడు. అనేక సందేహాలు వ్యక్తం చేశాడు. విద్యాసంస్థలను బహిష్కరించడం, జాతీయతను అతిగా ముందుకు తేవడం వంటి చర్యలు యువతను సంకుచిత జాతీయవాదం వైపు నడిపించవచ్చని ఆయన భావించారు. గాంధీ మాత్రం టాగూర్ విమర్శలను శత్రుత్వంగా చూడలేదు. ఆయనతో వ్యక్తిగతంగా అంతకంటే ఎక్కువగా ఉత్తరాల రూపంలో సందేహాలను నివృత్తి చేయడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో టాగూర్ ఆలోచనల్లోని ఆధునికతను గాంధీ స్వీకరించాడు. తనను అంతగా విమర్శించిన టాగూర్‌ను గురుదేవ్గా గాంధీ గౌరవించారు. టాగూర్ కూడా మహాత్మాగా గాంధీని సంబోధించారు. ఇద్దరూ ఒకరినొకరు గౌరవిస్తూనే తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేసుకున్నారు.












