ఆఫ్రికా దేశమైన డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (డీఆర్ కాంగో)లో విజృంభిస్తున్న ఎబోలా వ్యాధిని నియంత్రించేందుకు శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు. ఎబోలా వైరస్‌లోని బుండిబుగ్యో రకాన్ని ఎదుర్కొనే టీకాల సామర్థ్యాన్ని అంచనా వేయడానికి క్లినికల్ ట్రయల్‌ను ప్రారంభించారు. టుమైనిగా పేరుపెట్టిన ఈ ప్రయోగ పరీక్షలో భాగంగా న బునియా నగరంలో తొలి వ్యక్తికి టీకా ఇచ్చారు. స్వాహిలీ భాషలో టుమైని అంటే ఆశ అని అర్థం.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అధిపతి టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రేయేసస్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ పరీక్ష ద్వారా బుండిబుగ్యో వైరస్‌పై టీకాలు ఎంతవరకు పనిచేస్తాయో తెలుసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న వ్యాప్తిని అరికట్టడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు వేగంగా స్పందించేందుకు ఈ పరిశోధన ఉపయోగపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.
బుండిబుగ్యో వైరస్‌పై ప్రత్యేక దృష్టి
ఎబోలా వైరస్‌లో పలు రకాలు ఉన్నాయి. వాటిలో బుండిబుగ్యో రకం వల్ల ప్రస్తుతం డీఆర్ కాంగోలో పెద్ద ఎత్తున వ్యాధి వ్యాప్తి జరుగుతోంది. ఈ వైరస్ వల్ల కలిగే వ్యాధిని నివారించేందుకు ప్రత్యేకంగా ఆమోదం పొందిన టీకా ప్రస్తుతం అందుబాటులో లేదు. అందువల్ల ఇప్పటికే ఉన్న టీకాలు ఈ రకమైన వైరస్‌పై రక్షణ కల్పిస్తాయా అనే అంశాన్ని శాస్త్రీయంగా పరీక్షించడం అత్యవసరంగా మారింది.
ప్రస్తుతం పరీక్షలో మొదటగా ఎర్వెబో () టీకాను చేర్చారు. ఇది ఎబోలా వైరస్‌లో ఎక్కువగా గుర్తించిన జైర్ రకానికి వ్యతిరేకంగా ఉపయోగించేందుకు ఆమోదం పొందింది. అయితే బుండిబుగ్యో వైరస్‌పై కూడా ఇది రక్షణ కల్పిస్తుందా లేదా అన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. ఈ ప్రయోగ పరీక్షలో భాగంగా దాని భద్రత, ప్రభావశీలతను పరిశీలించనున్నారు.
ఒకే పరిశోధనలో పలు టీకాల పరీక్ష
టుమైని ప్రయోగ పరీక్ష ప్రత్యేకత ఏమిటంటే.. ఒకే పరిశోధనా విధానంలో పలు టీకాల అభ్యర్థులను అంచనా వేయవచ్చు. దీని ద్వారా వేర్వేరు టీకాలపై విడివిడిగా పరిశోధనలు నిర్వహించాల్సిన అవసరాన్ని తగ్గించి, అత్యవసర పరిస్థితుల్లో సమయాన్ని ఆదా చేయవచ్చు.
అమెరికాకు చెందిన మోడెర్నా అభివృద్ధి చేస్తున్న టీకా అభ్యర్థితో పాటు, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం, సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తున్న మరో టీకాను కూడా ఈ పరిశోధనలో చేర్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇవి బుండిబుగ్యో వైరస్‌ను లక్ష్యంగా చేసుకుని అభివృద్ధి చేస్తున్న టీకాలు. అయితే, వీటి భద్రత, రోగనిరోధక ప్రతిస్పందనకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని పరిశీలించిన తర్వాతే తదుపరి దశలకు తీసుకెళ్తారు.
బాధితులకు సమీప సంబంధాలున్నవారికి టీకాలు
ఈ ప్రయోగ పరీక్షలో రింగ్ వ్యాక్సినేషన్ విధానాన్ని అనుసరించనున్నారు. అంటే, ఎబోలా సోకిన వ్యక్తులకు సన్నిహితంగా ఉన్నవారు, వైరస్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉన్నవారిని గుర్తించి టీకాలు వేస్తారు. తద్వారా వైరస్ వ్యాప్తి గొలుసును అడ్డుకోవచ్చా అనే అంశాన్ని పరిశీలిస్తారు.
స్థానిక ఆరోగ్య శాఖలు, వైద్య సిబ్బంది, ప్రభావిత సమాజాలతో సమన్వయం చేసుకుంటూ పరిశోధనను కొనసాగించనున్నారు. ఈ పరీక్షలో గర్భిణులు, 12 ఏళ్లు పైబడిన పిల్లలను కూడా చేర్చే ప్రణాళిక ఉంది. ఎర్వెబో టీకా విషయంలో ఏడాది వయసు నుంచి పిల్లలను చేర్చే అంశాన్నీ పరిశీలిస్తున్నారు. చిన్నారులు, గర్భిణులపై టీకాల ప్రభావానికి సంబంధించిన ఆధారాలు పరిమితంగా ఉన్న నేపథ్యంలో ఈ పరిశోధనకు ప్రాధాన్యం ఉంది.


