దేశంలోని చిన్న వ్యాపారులు తమ వ్యాపార అవసరాల కోసం బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి వ్యాపార రుణాలు తీసుకోవడం కంటే వ్యక్తిగత రుణాలపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. వ్యాపార సంస్థల పేరుతో రుణాలు పొందడం కష్టంగా ఉండటం, వ్యక్తిగత రుణాల ద్వారా నిధులు సమకూర్చుకోవడం సులభంగా ఉండటం ఇందుకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ట్రాన్స్యూనియన్ సిబిల్, ఎన్ఎస్ఐసీ సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.
ఈ అధ్యయనం ప్రకారం, గత మూడేళ్లలో వ్యాపార అవసరాల కోసం వ్యక్తిగతంగా తీసుకున్న రుణాల మొత్తం తెలంగాణలో సగటున ఏటా 26 శాతం, ఆంధ్రప్రదేశ్లో 25 శాతం చొప్పున పెరిగింది. అదే సమయంలో సూక్ష్మ వ్యాపార సంస్థల పేరుతో తీసుకున్న రుణాల వృద్ధి తెలంగాణలో 13 శాతం, ఏపీలో 11 శాతానికే పరిమితమైంది.
20 నాటికి తెలంగాణలో 19.6 లక్షల మంది, ఆంధ్రప్రదేశ్లో 23.8 లక్షల మంది వ్యాపార అవసరాల కోసం వ్యక్తిగత రుణాలు తీసుకున్నారు. అయితే వీరు తమ వ్యాపార సంస్థల పేరుతో ఇప్పటివరకు ఒక్క రుణం కూడా పొందలేదు. రెండు రాష్ట్రాల్లో కలిపి ఇలాంటి రుణగ్రహీతల సంఖ్య 43.4 లక్షలుగా ఉంది.
వ్యక్తిగత రుణాల వైపు ఎందుకు మొగ్గు
చిన్న వ్యాపారులకు వ్యాపార సంస్థల పేరుతో రుణాలు పొందడంలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా సరైన ఆర్థిక పత్రాలు, వ్యాపార లావాదేవీల రికార్డులు, తగిన హామీ ఆస్తులు లేకపోవడం ఇబ్బందిగా మారుతోంది. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించినవారికి రుణ అర్హత నిరూపించుకోవడం కూడా సవాలుగా ఉంటోంది.
మరోవైపు, వ్యక్తిగతంగా ఇప్పటికే క్రెడిట్ చరిత్ర ఉన్నవారికి రుణాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంతో వ్యాపార అవసరాలకు కూడా వ్యక్తిగత రుణాలను వినియోగిస్తున్నారు. అయితే ఈ విధానం వల్ల వ్యాపార, వ్యక్తిగత ఆర్థిక బాధ్యతలు కలిసిపోయే ప్రమాదం ఉంది.
రుణ అర్హత ఉన్నా.. వ్యాపార రుణాలకు దూరం
ఈ అధ్యయనంలో మరో ఆసక్తికర అంశం వెల్లడైంది. వ్యాపార అవసరాల కోసం వ్యక్తిగత రుణాలు తీసుకున్నప్పటికీ, సంస్థల పేరుతో రుణాలు పొందని వారిలో చాలామందికి మంచి క్రెడిట్ స్కోర్లు ఉన్నాయి. తెలంగాణలో ఇలాంటి వారిలో 62 శాతం మందికి, ఆంధ్రప్రదేశ్లో 61 శాతం మందికి 730కి పైగా సిబిల్ స్కోర్లు ఉన్నాయి.
అంటే రుణాలు తిరిగి చెల్లించే సామర్థ్యం ఉన్నప్పటికీ, వ్యాపార సంస్థల పేరుతో రుణాలు పొందలేకపోతున్న వారి సంఖ్య గణనీయంగా ఉందని ఈ నివేదిక సూచిస్తోంది.
ఆస్తులపై రుణాలే అధికం
తెలంగాణలో చిన్న వ్యాపార రుణాల్లో ఆస్తులను తనఖా పెట్టి తీసుకునే రుణాల వాటా 53 శాతంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఇది 41 శాతంగా నమోదైంది. వ్యాపార అవసరాల కోసం వ్యక్తిగతంగా రుణాలు ఇచ్చే ఆర్థిక సంస్థల్లో ఎన్బీఎఫ్సీల పాత్ర కూడా కీలకంగా ఉంది. ఏపీలో ఈ సంస్థల వాటా 48 శాతం కాగా, తెలంగాణలో 38 శాతంగా ఉంది.
20 నాటికి తెలంగాణలో సూక్ష్మ వ్యాపారాల రుణ బకాయిలు రూ.1.74 లక్షల కోట్లకు, ఆంధ్రప్రదేశ్లో రూ.1.45 లక్షల కోట్లకు చేరాయి. దేశవ్యాప్తంగా సూక్ష్మ వ్యాపారాలకు సంబంధించిన మొత్తం వాణిజ్య రుణ బకాయిలు రూ.29.6 లక్షల కోట్లుగా ఉన్నాయి.

