రోబోటిక్స్ రంగంలో చైనా మరో వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఆ దేశానికి చెందిన ప్రముఖ రోబోటిక్స్ సంస్థ యూనిట్రీ రోబోటిక్స్ సరికొత్త హ్యూమనాయిడ్ రోబోను పరిచయం చేసింది. హెచ్2-ఎక్స్ కుంగ్ ఫూ లెజెండ్ గార్డియన్ పేరుతో రూపొందించిన ఈ రోబోను భద్రత, వ్యక్తిగత రక్షణ, అత్యవసర సహాయక చర్యల కోసం అభివృద్ధి చేశారు.
కంపెనీ విడుదల చేసిన ప్రచార వీడియోలో ఈ రోబో పలు సాహసోపేత విన్యాసాలు చేసింది. కత్తితో దాడి చేసేందుకు వచ్చిన వ్యక్తిని అడ్డుకుని, అతడి నుంచి ఆయుధాన్ని దూరం చేసేలా ప్రదర్శించారు. అలాగే ఒక మహిళకు రక్షణగా నిలిచే దృశ్యాన్ని చూపించారు. కారు తలుపులను తన్నడం, నాలుగు మీటర్ల ఎత్తు నుంచి కిందకు దూకడం వంటి విన్యాసాలను కూడా రోబో ప్రదర్శించింది.
ప్రమాదానికి గురై వాహనం కింద చిక్కుకున్న వ్యక్తిని బయటకు తీసేందుకు కారును పైకి ఎత్తినట్లు మరో దృశ్యంలో చూపించారు. వేగంగా వస్తున్న వాహనం నుంచి ఓ వ్యక్తిని పక్కకు లాగి రక్షించే సన్నివేశం కూడా వీడియోలో ఉంది. ఈ ప్రదర్శన ద్వారా రోబో శారీరక సామర్థ్యాలను కంపెనీ చాటింది.
ఎనిమిది గంటల బ్యాటరీ సామర్థ్యం
ఈ రోబో సుమారు ఎనిమిది గంటల వరకు స్టాండ్బైలో ఉండగలదని యూనిట్రీ సంస్థ వెల్లడించింది. అయితే, ఈ సమయం నిరంతరంగా కఠినమైన పనులు చేసే సామర్థ్యానికి సంబంధించినదని కంపెనీ స్పష్టంగా చెప్పలేదు. రక్షణ, రెస్క్యూ వంటి కార్యకలాపాలు నిర్వహించే సమయంలో బ్యాటరీ పనితీరు ఎలా ఉంటుందనే వివరాలు కూడా ఇంకా వెల్లడించలేదు.
స్వయంగా పనిచేస్తుందా రిమోట్ ద్వారా నియంత్రణా
ఈ రోబో ప్రదర్శనలో కనిపించిన విన్యాసాలు పూర్తిగా కృత్రిమ మేధ ఆధారంగా స్వయంప్రతిపత్తితో జరిగాయా లేక ముందుగా రూపొందించిన కదలికలు, రిమోట్ నియంత్రణ ద్వారా చేశారా అనే విషయంపై కంపెనీ స్పష్టత ఇవ్వలేదు. నిజ జీవితంలో అనూహ్యంగా ఎదురయ్యే ప్రమాదాలను గుర్తించి, పరిస్థితిని అంచనా వేసి సురక్షితంగా స్పందించడం రోబోలకు కీలకమైన సవాలు. ఈ సామర్థ్యంపై మరిన్ని వివరాలు రావాల్సి ఉంది.
ధర, మార్కెట్ విడుదలపై వివరాలు వెల్లడి కాలేదు
హెచ్2-ఎక్స్ రోబోను ఎప్పుడు మార్కెట్లోకి తీసుకొస్తారు దాని ధర ఎంత పూర్తి సాంకేతిక వివరాలు ఏమిటి అనే అంశాలపై యూనిట్రీ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం ఈ రోబోను పరిచయ వీడియో ద్వారా మాత్రమే ప్రదర్శించింది. ప్రమాదకరమైన మార్పులు చేయవద్దని, రోబోకు కనీసం రెండు నుంచి మూడు మీటర్ల దూరం పాటించాలని సంస్థ హెచ్చరించింది.
ఇప్పటివరకు వినోదం, పరిశ్రమలు, గిడ్డంగుల్లో వస్తువుల తరలింపు వంటి పనులకు ఎక్కువగా ఉపయోగించిన హ్యూమనాయిడ్ రోబోలను భద్రత, అత్యవసర రక్షణ రంగాల్లోనూ వినియోగించే దిశగా కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. అయితే, ప్రచార వీడియోల్లో చూపించిన సామర్థ్యాలు వాస్తవ పరిస్థితుల్లోనూ అదే స్థాయిలో పనిచేస్తాయా అనేది పరీక్షించాల్సి ఉంది. ముఖ్యంగా మనుషుల భద్రతకు సంబంధించిన పనుల్లో రోబోల నిర్ణయ సామర్థ్యం, నియంత్రణ, విశ్వసనీయత కీలకంగా మారనున్నాయి.
చైనాకు చెందిన యూనిట్రీ రోబోటిక్స్ సంస్థ హెచ్2-ఎక్స్ కుంగ్ ఫూ లెజెండ్ గార్డియన్ అనే సరికొత్త హ్యూమనాయిడ్ రోబోను పరిచయం చేసింది. ఈ రోబోను భద్రత, వ్యక్తిగత రక్షణ, అత్యవసర సహాయక చర్యల కోసం అభివృద్ధి చేశారు. ఇది కత్తితో దాడిని ఎదుర్కోవడం, ప్రమాదంలో ఉన్నవారిని రక్షించడం వంటి సామర్థ్యాలను ప్రదర్శించింది.

