ఆదిలాబాద్, 13 November
మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష సతీష్ పిలుపునిచ్చారు.
మాదకద్రవ్యాల వినియోగం వల్ల వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు కుటుంబ వ్యవస్థ, సమాజం కూడా తీవ్రంగా నష్టపోతాయని, మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష సతీష్ పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ పట్టణంలోని వినాయక్ చౌక్‌లో ఎస్.టి. జోసెఫ్స్ కాన్వెంట్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రహరి క్లబ్ మాదకద్రవ్యాల వినియోగ నిరోధక అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థి దశ ఎంతో విలువైనదని, ఈ సమయంలో మంచి లక్ష్యాలను ఏర్పరచుకొని విద్య, క్రీడలు, సృజనాత్మక కార్యక్రమాలపై దృష్టి సారించాలని సూచించారు. నేటి యువత, విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవితాన్ని ఎంచుకోవాలని అన్నారు. మాదకద్రవ్యాలకు అలవాటు పడకుండా ఉండటమే కాకుండా, ఎవరైనా వాటి ప్రభావానికి గురవుతున్నట్లు గుర్తిస్తే వారికి సరైన అవగాహన కల్పించి, అవసరమైన సహాయం అందించాలని కోరారు. మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులతో పాటు ప్రజల్లోనూ విస్తృత అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
విద్యార్థుల్లో సామాజిక బాధ్యతను పెంపొందించేలా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎస్.టి. జోసెఫ్స్ కాన్వెంట్ పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులను అభినందించారు. మంచి సమాజ నిర్మాణం విద్యార్థుల నుంచే ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండండి, ఆరోగ్యకరమైన జీవితాన్ని ఎంచుకోండి, మాదకద్రవ్యాల రహిత ఆదిలాబాద్ నిర్మాణంలో భాగస్వాములు కండి అని విద్యార్థులకు, ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష సతీష్‌తో పాటు మున్సిపల్ కౌన్సిలర్ మహబూబ్, పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

