గూడూరు, 12 November
మహబూబాబాద్ జిల్లా మండలం గుండెంగ గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగం కేసులో సర్పంచ్ కుమారుడు బోడ కిషన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సర్పంచ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి పంచాయతీ నిధులను స్వాహా చేశాడన్న ఆరోపణలపై గ్రామస్తులు గతంలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ సమగ్ర విచారణకు ఆదేశించగా, ఫోర్జరీ జరిగినట్లు నిర్ధారణ అయింది.
ఈ క్రమంలో ఇన్చార్జి పంచాయతీ కార్యదర్శి చిరంజీవులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు బోడ కిషన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి మహబూబాబాద్ కోర్టులో హాజరుపరిచారు. అక్రమాలకు పాల్పడిన నిందితుడి అరెస్ట్ పట్ల గుండెంగ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ గ్రామంలో సంబరాలు చేసుకున్నారు. ప్రజాధనాన్ని కాజేసే ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యుల అనధికారిక పెత్తనానికి ఈ ఘటన ఒక గట్టి గుణపాఠమని, తక్షణమే స్పందించి చర్యలు తీసుకున్న జిల్లా కలెక్టర్‌కు గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.






