పెద్దవూర, 12 November
మండల కేంద్రంలోని గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థులు అర్ధరాత్రి రోడ్లపైకి వచ్చి హల్చల్ సృష్టించిన సంఘటన తీవ్ర కలకలం రేపింది.
మండల కేంద్రంలోని గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థులు అర్ధరాత్రి రోడ్లపైకి వచ్చి హల్చల్ సృష్టించిన సంఘటన తీవ్ర కలకలం రేపింది. విద్యార్థులు పరస్పరం కొట్టుకుంటున్న దృశ్యాలతో కూడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, పాఠశాల యాజమాన్యం, సిబ్బందిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అర్ధరాత్రి సమయంలో విద్యార్థులు పాఠశాల నుంచి బయటకు ఎలా వచ్చారు వారు టౌన్‌కు చేరుకునే వరకు పాఠశాల సిబ్బంది ఏం చేస్తున్నారు రాత్రి వేళ పర్యవేక్షణ బాధ్యత ఎవరిది ప్రిన్సిపల్ ఎక్కడున్నారు విద్యార్థుల భద్రత కోసం సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారా ఉన్నప్పటికీ ఈ ఘటన ఎలా జరిగింది వంటి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఘర్షణ పడే పరిస్థితి ఎందుకు తలెత్తిందనే దానిపై స్పష్టత కొరవడింది.
స్థానిక ఎంఈఓ, మండల ప్రత్యేక అధికారి, గురుకుల విద్యాశాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఏమైందని తల్లిదండ్రులు, స్థానికులు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు, ఇలాంటి ఘటనలతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అధికారులారా, విద్యార్థుల భద్రతకు ఎవరు బాధ్యత వహిస్తారని వారు నిలదీస్తున్నారు.
గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల భద్రతపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. అర్ధరాత్రి విద్యార్థులు బయటకు వచ్చిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి, పాఠశాల ప్రిన్సిపల్, సిబ్బంది విధులపై ఆరా తీయాలని డిమాండ్ చేస్తున్నారు. బాధ్యుల నిర్లక్ష్యం తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతూ, గురుకులాల్లో రక్షణ కల్పించడంలో విఫలమవుతున్నారని ఆరోపిస్తున్నారు.
వైరల్ అవుతున్న వీడియోపై అధికారులు స్పందించి, అసలు వాస్తవాలను వెల్లడించాలని తల్లిదండ్రులు, స్థానికులు కోరుతున్నారు.

