తిరుపతి, 12 November
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి రద్దయిన నేపథ్యంలో కొత్త చైర్మన్ ఎంపికపై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం స్పెసిఫైడ్ అథారిటీ అధికారుల పర్యవేక్షణ, పాలనలోనే టీటీడీ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో పాలక మండలిని కొత్తగా ఏర్పాటు చేయడం సాధ్యం కాదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. న గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాతే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ పూర్తిగా ఎత్తివేయడం సాధ్యమవుతుంది. దీంతో అప్పటి వరకు టీటీడీ బోర్డును కూడా ఏర్పాటు చేయలేరు. ప్రస్తుతం చైర్మన్ రేసులో అనేక మంది రాజకీయ ప్రముఖులతో పాటు, ఆర్ఎస్ఎస్ నుంచి కూడా డిమాండ్లు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ రేసులో ఒక ఎన్నారై ముందున్నారనే వాదన కూడా వినిపిస్తోంది. మరోవైపు, సినీ రంగానికి చెందిన ముగ్గురు ప్రముఖులు కూడా చైర్మన్ రేసులోకి వచ్చారని టీడీపీలోని అత్యంత విశ్వసనీయ నాయకుడి ద్వారా తెలిసింది. ఈ ముగ్గురు ఒకే సామాజిక వర్గానికి చెందినవారని, పైగా చంద్రబాబుకు అత్యంత నమ్మకస్తులు, విధేయులని కూడా ఆ నాయకుడు తెలిపారు.
వీరిలో దర్శకుడు రాఘవేంద్రరావు పేరు ముందుందని చెబుతున్నారు. గతంలో 2014-19 మధ్య టీడీపీ హయాంలో తిరుమలకు చెందిన ఎస్వీబీసీ ఛానెల్‌కు ఆయన చైర్మన్‌గా వ్యవహరించారు. వైసీపీ అధికారంలోకి వచ్చే వరకు, సుమారు నాలుగు సంవత్సరాలు ఆయన ఈ పదవిలో కొనసాగారు. ఇప్పుడు నేరుగా బోర్డు చైర్మన్ పదవిని ఆశిస్తున్నట్లు సదరు నేత చెబుతున్నారు. దీనిపై ఇప్పటికే చంద్రబాబుకు సమాచారం అందించారని, ఒకటి రెండు సార్లు ఫోన్లు కూడా చేసినట్లు సమాచారం అందింది. ఈ జాబితాలో రెండో వ్యక్తి ప్రముఖ నిర్మాత సీ. అశ్వనీదత్ అని తెలుస్తోంది. గతంలో టీడీపీ కండువా కప్పుకున్న దత్, విజయవాడ ఎంపీగా టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ఆయన కూడా చివరి అవకాశంగా తనకు టీటీడీ బోర్డు చైర్మన్ పదవి కావాలని కోరుతున్నట్లు సమాచారం. పార్టీ పరంగా ఆయన యాక్టివ్‌గా లేకపోయినా, తరచుగా ఏపీ రాజకీయాలపై తన అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. చంద్రబాబు అరెస్టు సమయంలో ఐటీ ఉద్యోగుల ఉద్యమానికి మద్దతు తెలిపారు.
ఈ జాబితాలో మూడో వ్యక్తి మాజీ ఎంపీ, నటుడు, వ్యాపారవేత్త మురళీమోహన్. గతంలో టీడీపీ తరఫున రాజమండ్రి ఎంపీగా పనిచేశారు. తన కోడలిని కూడా ఎన్నికల వేళ పార్టీ తరఫున పరిచయం చేశారు. కారణాలు ఏవైనా, గత ఎన్నికలకు ముందు ఆయన తప్పుకున్నారు. అప్పట్లో అనారోగ్యం బారిన పడ్డారు. చంద్రబాబు స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి పలకరించారు. ఇప్పుడు ఆయన కూడా టీటీడీ బోర్డు చైర్మన్ పదవిని కోరుతున్నట్లు టీడీపీ ముఖ్య నాయకుడు ఒకరు ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు. చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి.



