వనపర్తి జిల్లా గోపాలపేట మండల కేంద్రానికి చెందిన మాజీ వార్డు సభ్యుడు వెంగరి గల్ల బాలస్వామి (70) గత కొన్ని రోజుల నుంచి అపెండిక్స్ తో ఇబ్బంది పడుతున్నారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మహబూబ్నగర్ ఎస్వీఎస్ దవాఖానలో ఆయనకు విజయవంతంగా ఆపరేషన్ జరిగింది. ప్రస్తుతం ఆయన ఇంటి వద్ద కోలుకుంటున్నారు.
నాయకుల పరామర్శ
ఈ నేపథ్యంలో బాలస్వామిని ఉమ్మడి మండల వ్యవసాయ మార్కెట్ ఉపాధ్యక్షుడు సత్యశీల రెడ్డి పరామర్శించారు. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మనోధైర్యాన్ని కల్పించి, ఏమైనా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం నుండి ఆదుకుంటామని తెలిపారు.
ఆరోగ్యశ్రీపై బాలస్వామి స్పందన
ఈ సందర్భంగా బాధితుడు బాలస్వామి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ద్వారా బతికి బయటపడ్డానని తెలిపారు. ఆరోగ్యశ్రీ లేకపోతే నాలాంటి పేదవారికి చనిపోయే పరిస్థితి ఉండేదని అన్నారు. ఆనాటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ఇప్పటికీ కొనసాగడంతోనే తాను బతికాను అని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎల్లవేళలా ప్రజల అండగా ఉండాలని, ముందు ముందు మంచి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారిని ఆదుకోవాలని కోరుకుంటున్నాను అని బాలస్వామి అన్నారు. ఈ పరామర్శలో రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొంకి వెంకటేష్, టౌన్ అధ్యక్షుడు ధన్వాడ నాగరాజు యాదవ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు లాయర్ ఆంజనేయులు, మాజీ ఎంపీటీసీ మేస్త్రి బాలయ్య, కేతపల్లి వెంకటయ్య, సిరా వాటి రవి తదితరులు పాల్గొన్నారు.

