వనపర్తి జిల్లా ఎదుల మండలం పరిధిలోని రిజర్వాయర్ కింద ఉన్న పెద్ద చెరువు, అనంతపురం చెరువులకు గత పది సంవత్సరాలుగా నీరందక పంటలు ఎండిపోతున్నాయని, ఈ నేపథ్యంలో సర్పంచ్ పరశురాం యాదవ్, మండల అధ్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డి రైతుల ఇబ్బందులను తనకు తెలియజేయగా, ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, ఓట్లేసి గెలిపించిన ప్రజల రుణం అభివృద్ధి పనుల ద్వారా తీర్చుకుంటానని, నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే తన ప్రధాన లక్ష్యమని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి స్పష్టం చేశారు.
డి5 కాలువ నుంచి చెరువుకు, అనంతపురం చెరువుకు ప్రత్యేక కాలువ ఏర్పాటు చేసి సాగునీరు అందించే కార్యక్రమంలో భాగంగా బుధవారం కాలువ వెంట నీళ్లను విడుదల చేసే కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై నీటిని విడుదల చేశారు. రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ఒక పెద్ద జీతగాడిలా పనిచేస్తానని పేర్కొన్నారు.
ఎల్నినో ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా కరువు పరిస్థితులు నెలకొంటున్నప్పటికీ తెలంగాణలో, ముఖ్యంగా వనపర్తి ప్రాంతంలో అలాంటి పరిస్థితులు లేవని ఎమ్మెల్యే అన్నారు. అయితే బీఆర్ఎస్ నాయకులకు మాత్రం నిజంగానే కరువు వచ్చిందని, గతంలో మాదిరిగా కమిషన్లు దండుకునే అవకాశం లేకపోవడమే వారి అసహనానికి కారణమని ఎద్దేవా చేశారు.
కరువు వచ్చిందంటూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని హితవు పలికారు. రైతులకు సాగునీరు అందించేందుకు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. రిజర్వాయర్ నుంచి డీ-5 కాలువ ద్వారా , అనంతపురం గ్రామాల చెరువులకు కాలువల ద్వారా సాగునీరు అందించేలా కృషి చేశారు.
తన సొంత నిధులతో అవసరమైన పనులు చేపట్టించి చెరువులకు నీరు చేరేలా కృషి చేశారు. దీంతో ఆయా గ్రామాల రైతులు, ప్రజలు ఎమ్మెల్యేకు హర్షాతిరేకాలతో కృతజ్ఞతలు తెలిపారు.
సాగునీటి విషయంలో రైతులు ఇబ్బందులు పడకుండా ఇరిగేషన్ అధికారులు డ్యామ్ సేఫ్టీ నిబంధనలను పాటిస్తూ, కాలువల ద్వారా ఆయా గ్రామాలకు నీరు అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే సూచించారు.
గత పాలనపై విమర్శలు
దత్తత పేరుతో హామీలు.. గ్రామాలకు చేసిందేమీ లేదన్నారు. ఇప్పుడు గత పాలకులు గ్రామాన్ని దత్తత తీసుకున్నామని గొప్పలు చెప్పుకున్నప్పటికీ, ఒక బ్యాంకు ఏర్పాటు మినహా గ్రామానికి చెప్పుకోదగ్గ అభివృద్ధి చేయలేదని ఎమ్మెల్యే విమర్శించారు.
రిజర్వాయర్ నిర్మాణం పేరుతో రైతులకు ఎన్నో హామీలు ఇచ్చి, గ్రామాలను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని నమ్మబలికి చివరకు ప్రజలను నిరాశపరిచారని ఆరోపించారు. రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే పెండింగ్లో ఉన్న నష్టపరిహారాన్ని అందించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు.
, కొంకలపల్లి, బండరావిపాకుల తదితర గ్రామాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి సమస్యలను తీసుకెళ్లగా, ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు.






