వనపర్తి జిల్లా గోపాల్పేట, ఏదుల మండలాల రైతులు కొడంగల్లో నిర్వహిస్తున్న మెగా రైతు మేళా పారిశ్రామిక ప్రదర్శనకు భారీగా తరలివెళ్లారు. రైతుల ఆర్థిక అభివృద్ధి, ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించడమే ఈ మేళా ముఖ్య ఉద్దేశ్యం. ఆరు బస్సుల్లో సుమారు 360 మంది రైతులు, మహిళా సంఘాల సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు తరలివెళ్లారు.
ఉమ్మడి మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షురాలు సత్యశీలా రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ధన్వాడ నాగరాజు యాదవ్ ఆధ్వర్యంలో ఈ తరలింపునకు ఏర్పాట్లు చేశారు. మండలంలోని పోల్కేపాడు, లక్ష్మీదేవిపల్లి, తాడిపర్తి, బుద్ధారం, చాకలిపల్లి, చెన్నూర్, ఎదుట్ల, తిరుమలాపూర్, అలాగే ఏదుల మండలంలోని అనంతపురం, చీర్కపల్లి, చెన్నారం, మాచుపల్లి, సింగాయ్యపల్లి తదితర గ్రామాల నుంచి రైతులు, మహిళలు తరలివెళ్లారు.
ఈ సందర్భంగా సత్యశీలా రెడ్డి మాట్లాడుతూ, కొడంగల్లో రైతుల కోసం ఏర్పాటు చేసిన వివిధ ప్రదర్శనశాలల్లో వ్యవసాయంలో నూతన పద్ధతులు, రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు అవసరమైన అంశాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. సేంద్రియ వ్యవసాయం, ఆరుతడి పంటల సాగుపై ప్రత్యేకంగా అవగాహన పొందే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు.
రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడే గ్రామాలు, తద్వారా పట్టణాలు, జిల్లాలు, రాష్ట్రం అభివృద్ధి చెంది దేశం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందని ఆమె పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాల్గొనే సభకు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ నాయకులు హాజరైనట్లు సత్యశీలా రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంతో పాటు, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు, పెట్రోలు బంకులు, మహిళా సంఘాల పేరుతో బస్సులు అందిస్తూ వారి ఆర్థిక స్వావలంబనకు కృషి చేస్తోందని ఆమె వివరించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి కొంకి వెంకటేష్, చీర్కపల్లి సర్పంచ్ పగడాల రవి, లక్ష్మీదేవిపల్లి సర్పంచ్ గురగాల బంగారయ్య, వివిధ గ్రామాల సర్పంచులు, మండల వ్యవసాయ అధికారి రమేష్, , ఏదుల మండలాల వ్యవసాయ విస్తరణ అధికారులు, ఇందిరా క్రాంతి పథకం ఏపీఎం సావిత్రి, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి శివన్న, సీనియర్ నాయకులు కె. వెంకటయ్య, వెంకట్రెడ్డి, కందూర్ రమేష్, జంగిడి బాలయ్య, ఎం. రాములు, చింతగిరి బాలయ్య, వెంకటేష్, పోల్కేపాడు వెంకటస్వామి తదితరులతో పాటు మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.


