సారంగాపూర్, 9 November
రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఎంబడి రాజేశ్వర్, మండలం పెండల్ దరి గిరిజన గ్రామంలోని పేద కుటుంబాలతో కలిసి దీపావళి పండుగను జరుపుకున్నారు.
మారుమూల గిరిజన గూడెంలో పేద కుటుంబాల మధ్య దీపావళి పండుగను జరుపుకుంటూ వారి ముఖాల్లో ఆనందం నింపారు రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఎంబడి రాజేశ్వర్. రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి సంబరాలు నిర్వహించాలన్న సంకల్పంతో మండలం పెండల్ దరి గిరిజన గ్రామాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా మమేకమయ్యారు. పేద కుటుంబాలకు టపాసులు, స్వీట్లు పంపిణీ చేసి వారితో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు.
ఏళ్ల తరబడి సొంతింటి కోసం ఎదురుచూసిన పేదలకు ఇందిరమ్మ ఇళ్ల ద్వారా సొంతింటి కల సాకారం కావడం ఎంతో సంతోషకరమని రాజేశ్వర్ పేర్కొన్నారు. పేదల గడపల్లో దీపాల వెలుగులు విరజిమ్మడం, వారి కుటుంబాల్లో పండుగ ఆనందం వెల్లివిరియడం ప్రభుత్వ సంక్షేమ పాలనకు నిదర్శనమని అన్నారు. పేదలకు కేవలం ఇళ్లు నిర్మించి ఇవ్వడమే కాకుండా వారి సంతోషాల్లో భాగస్వాములవ్వడం కూడా ప్రజాప్రతినిధులు, నాయకుల బాధ్యత అని పేర్కొన్నారు.
పట్టణాలకు, ప్రధాన రహదారులకు దూరంగా ఉన్న మారుమూల గిరిజన గ్రామానికి వెళ్లి పేదలతో కలిసి పండుగ జరుపుకోవడం అక్కడి కుటుంబాల్లో ప్రత్యేక ఆనందాన్ని నింపింది. నాయకులు ప్రజల మధ్యకు వెళ్లి వారి కష్టసుఖాల్లో పాలుపంచుకున్నప్పుడే నిజమైన ప్రజాసేవకు అర్థం ఉంటుందని ఈ కార్యక్రమం చాటిచెప్పింది. ఇందిరమ్మ ఇళ్లలో వెలిగిన దీపాల కాంతులతో గిరిజన గూడెంలో దీపావళి వేడుకలు సందడిగా సాగాయి.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ హాదీ, గ్రామ పంచాయతీ సర్పంచ్ షేక్బాయ్, సర్పంచ్ భూమన్న, డాక్టర్ సెల్ నాయకులు డాక్టర్ ప్రవీణ్ కుమార్, మాజీ మండల అధ్యక్షుడు బొల్లోజు నరసయ్య, కొత్త కాపు పోతారెడ్డి, రాజేశ్వర్ రావు, బట్టు భోజన్నా, జిల్లా కార్యదర్శి ఎంబడి రాకేష్, ఇందిరమ్మ లబ్ధిదారులు నాగరావ్ దంపతులు, గంగారం, శంకర్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


