పేద ప్రజలకు నాణ్యమైన విద్య, మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధిని సమాంతరంగా ముందుకు తీసుకెళ్లడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలోని మండలంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని ప్రసంగించారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు పూర్తిస్థాయిలో అనుకూలించకపోయినా పేదల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధితో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో ప్రతి నియోజకవర్గంలో సుమారు రూ.200 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సమీకృత పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరచడంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని తెలిపారు. విద్యారంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని వివరించారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం
ఇందిరమ్మ ఇళ్ల పథకంలో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నామని మంత్రి తెలిపారు. లబ్ధిదారులకు అందించే ఆర్థిక సహాయాన్ని ఎలాంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేసే విధంగా చర్యలు తీసుకున్నామని చెప్పారు. పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ సంకల్పమని పేర్కొన్నారు.
రైతు సంక్షేమం
రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, గతంలో వరి సాగు చేయవద్దన్న పరిస్థితులకు భిన్నంగా తమ ప్రభుత్వం వరి సాగును ప్రోత్సహిస్తోందని మంత్రి అన్నారు. రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధరతో పాటు క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందిస్తున్నామని వివరించారు. రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తూ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
భూధార్ విధానం
భూములకు ఆధార్ తరహాలో ప్రత్యేక గుర్తింపు కల్పించే ఉద్దేశంతో భూధార్ విధానాన్ని తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని పొంగులేటి పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం భూ సంస్కరణలు చేపట్టి పేదలకు భూములపై హక్కులు కల్పించిందని, అనంతరం అధికారంలోకి వచ్చిన పాలకులు భూముల విషయంలో అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు. ప్రజలకు మాయమాటలు చెప్పడం తమ ప్రభుత్వ విధానం కాదని, ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు.
బతుకమ్మ చీరల పంపిణీ అంశాన్ని ప్రస్తావిస్తూ గత ప్రభుత్వ హయాంలో పంపిణీ చేసిన చీరల నాణ్యతపై మహిళల నుంచి విమర్శలు వచ్చాయని మంత్రి వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం అందించిన చీరలను మహిళలు సంతోషంగా ధరించారని పేర్కొన్నారు. త్వరలోనే చిలకపచ్చ రంగు చీరలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు.
షాద్‌నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ పనితీరును మంత్రి పొంగులేటి ప్రత్యేకంగా ప్రశంసించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఒక పనిని సంకల్పిస్తే అది పూర్తయ్యే వరకు ఎమ్మెల్యే పట్టువదలరని కొనియాడారు. ముఖ్యమంత్రి వద్దైనా, తన వద్దైనా నియోజకవర్గానికి అవసరమైన పనుల కోసం పట్టుబట్టి నిధులు, అనుమతులు సాధించుకునే నాయకుడని ప్రశంసించారు. ప్రజా సమస్యల పరిష్కారం, ప్రాంత అభివృద్ధి విషయంలో ఆయన చూపిస్తున్న చొరవ అభినందనీయమని అన్నారు.


