ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడే కరువు పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థులపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు అన్ని రకాల పరీక్ష ఫీజులను మాఫీ చేయాలని జిల్లా ఉపసర్పంచ్‌ల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ మూడ్ దయానంద్ ప్రభుత్వాన్ని కోరారు. విద్యాసంస్థలు వార్షిక ఫీజులో సగం మాత్రమే వసూలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఎస్ఎస్సీ, ఇంటర్, డిగ్రీ, పీజీ, బీటెక్, ఎంటెక్ తదితర కోర్సుల పరీక్ష ఫీజులను ప్రభుత్వం పూర్తిగా మాఫీ చేసి, ఉచితంగా పరీక్షలు నిర్వహించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. విద్యార్థులపై ఆర్థిక భారం తగ్గించడమే దీని ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు.
ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థుల నుంచి పరీక్ష ఫీజులు వసూలు చేయకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, విద్యాసంస్థల యాజమాన్యాలు కుల, వర్గ భేదాలు లేకుండా విద్యార్థుల వార్షిక ఫీజులో సగం మాత్రమే వసూలు చేయాలని ఆయన కోరారు.
ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ, సంబంధిత విద్యా మండళ్ల అధికారులు పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం జిల్లా ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియాకు మూడ్ దయానంద్ వినతిపత్రం అందజేశారు.












