నిర్మల్ జిల్లా మండలం దిమ్మదుర్తి గ్రామంలో గురువారం రాత్రి జరిగిన బతుకమ్మ సంబరాలలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జువ్వాడి శ్రీదేవి పాల్గొన్నారు. గ్రామ మహిళలతో కలిసి ఆమె బతుకమ్మ ఆడి, పాటల్లో పాలుపంచుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం (హైకోర్టు) న్యాయమూర్తి జువ్వాడి శ్రీదేవి నిర్మల్ జిల్లా మండలం దిమ్మదుర్తి గ్రామంలో ఘనంగా నిర్వహించిన బతుకమ్మ సంబరాలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె సంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
పండుగ వాతావరణం ఉట్టిపడేలా సాగిన ఈ వేడుకల్లో న్యాయమూర్తి జువ్వాడి శ్రీదేవి గ్రామ మహిళలతో కలిసి సంతోషంగా బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ఆటపాటల్లో పాలుపంచుకున్నారు. సాంప్రదాయ నృత్యాలతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది.
బతుకమ్మ గొప్ప సాంస్కృతిక ప్రతీక
ఈ సందర్భంగా ఆమె విలేకరులతో, గ్రామస్తులతో మాట్లాడుతూ బతుకమ్మ సంబరాలు కేవలం పూజా వేడుకలు మాత్రమే కాదని, మన సనాతన ధర్మ విలువలను ఎలుగెత్తి చాటడంతో పాటు సమాజంలో మానవత్వాన్ని, ఐక్యతను పెంపొందించే గొప్ప సాంస్కృతిక ప్రతీక అని కొనియాడారు. తెలంగాణ ప్రత్యేక సంస్కృతీ సాంప్రదాయాలకు బతుకమ్మ పండుగ నిలువెత్తు నిదర్శనమని ఆమె అభివర్ణించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. పండుగ సంబురాలు గ్రామస్థుల సమక్షంలో అత్యంత ఆనందోత్సాహాల మధ్య ముగిశాయి.

