ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో పిచ్చికుక్క దాడిలో తీవ్రంగా గాయపడిన బాలుడు సంఘర్ష్ కు టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ వైస్ చైర్మన్ దుర్గం శేఖర్ ఆర్థిక సహాయం అందించారు. ముఖం, ముక్కు, పెదవి, చెంపపై కుక్క కరవడంతో సంఘర్ష్ కు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని ప్రబుద్ధ నగర్ కాలనీకి చెందిన గైక్వాడ్ సంజన, సచిన్ ల కుమారుడు సంఘర్ష్ పిచ్చికుక్క దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. ముఖం, ముక్కు, పెదవి, చెంపపై పిచ్చికుక్క కరవడంతో అత్యంత తీవ్ర గాయాలైన సంఘర్ష్ ను ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాయాలైన సంఘర్ష్ కు వైద్యులు మెరుగైన చికిత్స అందించారు.
చికిత్స అనంతరం తిరిగి స్వగ్రామానికి చేరుకున్న సంఘర్ష్, మెరుగైన వైద్యం కోసం మళ్ళీ హైదరాబాద్ వెళ్లాల్సి ఉంది. నిరుపేదలైన ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉంది. విషయం తెలుసుకున్న టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ వైస్ చైర్మన్ దుర్గం శేఖర్, ఇంద్రవెల్లి మండలం అంబేద్కర్ అసోసియేషన్ అధ్యక్షులు సొన్ కాంబ్లె జితేందర్ తో కలిసి గాయపడిన సంఘర్ష్ ను పరామర్శించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ఆసుపత్రికి తరలించేందుకు తనవంతుగా రూ.10,000 ఆర్థిక సహాయం అందించారు.
ఇంద్రవెల్లిలో వీధి కుక్కల బెడద వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని తెలుసుకున్న దుర్గం శేఖర్, పిచ్చి కుక్కలను ఇక్కడి నుండి వేరే ప్రాంతాలకు తరలించేలా జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, స్థానిక ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, జిల్లా ఇంచార్జి మంత్రివర్యులకు సమాచారం అందించి, చర్యలు తీసుకోవాలని సూచించారు.
కష్టకాలంలో ఉన్న నిరుపేద కుటుంబానికి సహాయం అందించినందుకు, సంఘర్ష్ తల్లితండ్రులు, కాలనీ వాసులు టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ వైస్ చైర్మన్ దుర్గం శేఖర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా మీడియా కోఆర్డినేటర్ మేకల జితేందర్, ఇంద్రవెల్లి మండల అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ సొన్ కాంబ్లె జితేందర్, అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ మాజీ మండల అధ్యక్షుడు మనోహర్, డిసిసి కార్యదర్శి ఎండీ మసూద్, భీం ఆర్మీ మండల అధ్యక్షులు ఉత్తం సూర్యవంశీ, నాయకులు మాధస్తు మహేందర్, ఆడే రఘు తదితరులు పాల్గొన్నారు.

