ముధోల్ నియోజకవర్గంలో రాజకీయ నాయకుల ఆస్తులు, ఆదాయాలపై మనోరంజని తెలుగు టైమ్స్ ప్రత్యేక పరిశోధన చేపట్టింది. ప్రస్తుత ఎమ్మెల్యే రామ్ రావు పవార్, మాజీ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి ఎన్నికల అఫిడవిట్లలో సమర్పించిన వివరాలను విశ్లేషించింది. ప్రకటించిన ఆస్తులు, ఆదాయాల మధ్య సంబంధంపై ఈ పరిశోధన దృష్టి సారించింది.
ముధోల్ నియోజకవర్గ రాజకీయాల్లో అధికార మార్పులు జరుగుతున్నా.. ప్రజా జీవితంలోకి వచ్చిన రాజకీయ నాయకుల ఆస్తులు కాలక్రమంలో ఎలా మారాయి వారి ప్రకటించిన ఆదాయానికి, ఆస్తుల పెరుగుదలకు మధ్య సంబంధం ఏమిటి అనే ప్రశ్నలు ప్రజల్లో మిగిలే ఉన్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానం కోసం మనోరంజని తెలుగు టైమ్స్, ఎన్నికల సమయంలో అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్లలోని వివరాలను పరిశీలించింది. మొదటి దశలో ప్రస్తుత ఎమ్మెల్యే రామ్ రావు పవార్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి ఎన్నికల అఫిడవిట్ వివరాలను పరిశీలించాం.
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ముధోల్ నుంచి బీజేపీ అభ్యర్థిగా రామ్ రావు పవార్ విజయం సాధించారు. ఆయనకు 98,252 ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థి గడ్డిగారి విఠల్ రెడ్డికి 74,253 ఓట్లు వచ్చాయి. మెజారిటీ 23,999 ఓట్లు.
ఎన్నికల అఫిడవిట్ ప్రకారం రామ్ రావు పవార్ ప్రకటించిన మొత్తం ఆస్తుల విలువ రూ.27,79,25,792, అంటే సుమారు రూ.27.79 కోట్లు. అందులో స్థిరాస్తుల విలువ సుమారు రూ.19 కోట్లు, చరాస్తులు సుమారు రూ.8.8 కోట్లుగా నమోదయ్యాయి. అఫిడవిట్లో ఎలాంటి బకాయిలు చూపించలేదు. ఆయన తన వృత్తి/వ్యాపార సంబంధాలుగా భైంసాలోని కృషి కాటన్ ఇండస్ట్రీస్, భైంసా జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ ఫ్యాక్టరీ, నాందేడ్‌లోని పాటిల్ ప్లాజా లాడ్జింగ్బోర్డింగ్రెస్టారెంట్ తదితర సంస్థల్లో భాగస్వామ్యం లేదా వాటాదారుగా వివరించారు.

