మండలం కల్లూర్ గ్రామ పంచాయతీలో 15వ ఆర్థిక సంఘం నిధుల దుర్వినియోగం, నిబంధనల ఉల్లంఘనలపై జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా చర్యలు తీసుకున్నారు. సర్పంచ్, ఉప సర్పంచ్ ల చెక్ పవర్లను ఆరు నెలల పాటు నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. వ్యక్తిగత ఖాతాలకు నిధుల మళ్లింపు, నిబంధనలకు విరుద్ధంగా ఖర్చు చేసినట్లు విచారణలో తేలింది.
జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా గురువారం ఒక ప్రకటనలో ఈ వివరాలు వెల్లడించారు. నిబంధనలకు విరుద్ధంగా 5,85,933 రూపాయల గ్రామ పంచాయతీ నిధులను సర్పంచ్ కుటుంబ సభ్యుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాకు మళ్లించినట్లు తెలిపారు. అలాగే 1,85,043 రూపాయల 15వ ఆర్థిక సంఘం గ్రాంట్ నిధులను నిబంధనలకు విరుద్ధంగా ఖర్చు చేసినట్లు విచారణ నివేదిక ద్వారా గుర్తించారు. గ్రామసభ ముందస్తు అనుమతి లేకుండా, కొటేషన్లు, టెండర్ నిబంధనలు పాటించకుండా పనులు చేపట్టడంపై వచ్చిన ఫిర్యాదుల మేరకు విచారణ చేపట్టారు. ఈ విచారణ ఆధారంగా సర్పంచ్ పెంట దశరథ్, ఉపసర్పంచ్ సూర్యవంశీ నారాయణలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వారు సమర్పించిన వివరణలను పరిశీలించిన అనంతరం ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
వారి వివరణ అసంతృప్తికరంగా ఉండడంతో పాటు ఆర్థిక అక్రమాలు నిర్ధారణ కావడంతో, పంచాయతీ రాజ్ చట్టం రూల్ 42(1) (జి.ఓ.ఎం.ఎస్. నం. 30, తేదీ: 20.01.1995) ప్రకారం సర్పంచ్ పెంట దశరథ్, అలాగే చెక్కులపై ఉమ్మడి సంతకాలు చేసినందున ఉపసర్పంచ్ సూర్యవంశీ నారాయణల చెక్ పవర్లను తక్షణమే అమలులోకి వచ్చేలా ఆరు నెలల పాటు నిలిపివేస్తూ (ఫ్రీజ్) చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. గ్రామ పంచాయతీలో అత్యవసర పరిస్థితులు, అభివృద్ధి పనుల నిమిత్తం కల్లూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి, మండల పంచాయతీ అధికారి ఉమ్మడి సంతకాలతో నిధులు ఉపసంహరించుకోవడానికి అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వ నిధుల దుర్వినియోగానికి పాల్పడినా, నియమ నిబంధనలు ఉల్లంఘించినా సహించేది లేదని, ప్రతి పైసా పారదర్శకంగా ప్రజల సంక్షేమం కోసమే ఖర్చు చేయాలని కలెక్టర్ హెచ్చరించారు.


